టీడీపీ ఎమ్మెల్యేలకు కమలంతోనే భయమా?

పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం ఎమ్మెల్యేలకు కొత్త భయం పట్టుకుంది. వచ్చే ఎన్నికల్లో తమకు సీటు దక్కుతుందో లేదో అన్న టెన్షన్ పట్టుకుంది. ఇందుకు ప్రధాన కారణం టీడీపీ అధిష్టానం కాదు. కమలనాధులతోనే సమస్య. పశ్చిమ గోదావరి జిల్లాపై కమలనాధులు కన్నేశారు. వచ్చే ఎన్నికల్లో వెస్ట్ లో మరిన్ని సీట్లు సాధించాలని బీజేపీ భావిస్తుంది. సామాజిక వర్గాల సమీకరణ ప్రకారం బీజేపీకి పశ్చిమ గోదావరి జిల్లా తమకు కలసి వస్తుందని కమలనాధులు భావిస్తున్నారు. ఇప్పటికే తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే, నరసాపురం ఎంపీ స్థానాన్ని దక్కించుకున్న బీజేపీ వచ్చే ఎన్నికల్లో మరిన్ని సీట్లు దక్కించుకోవాలని భావిస్తోంది. అందుకు అనుగుణంగా ప్రణాళికలను రచిస్తుంది. అందుకోసం పార్టీ సభ్యత్వాన్ని జిల్లాలో ముమ్మరం చేసింది. తరచూ నేతల పర్యటనలతో పశ్చిమ గోదావరి జిల్లాలో బీజేపీ కళకళలాడుతోంది.
ఈసారి ఎక్కువ టిక్కెట్లు కావాలని.....
2014 ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ స్వీప్ చేసేసింది. అయితే వచ్చే ఎన్నికల్లో మాత్రం ఈసారి అంత సీన్ ఉండక పోవచ్చు. ఎన్నికల హామీలను అమలు చేయకపోవడం, నిధుల లేమితో నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు నిలిచిపోవడం, నేతల మధ్య విభేదాలు వెరసి ఈసారి టీడీపీకి గతంలో మాదిరి ఏకపక్ష ఓటింగ్ ఉండదన్నది ఆ ప్రాంత వాసులే చెబుతున్నారు. దాదాపు సగం మంది టీడీపీ ఎమ్మెల్యేలు గెలిచే ఛాన్స్ లేదని అంటున్నారు. దీంతో బీజేపీ అలర్ట్ అయింది. గతంలో తాడేపల్లి గూడెం టిక్కెట్ మాత్రమే తాము అడిగామని, ఈసారి జిల్లాలో తమ బలం పెరిగిందని, పాలకొల్లు, భీమవరం టిక్కెట్లతో పాటు మరో నియోజకవర్గాన్ని కూడా అడగాలను కుంటున్నామని బీజేపీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. టీడీపీ మీద అసంతృప్తి ఉందని, తమకు సీట్లు ఇస్తే గెలుచుకుని తీరతామని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఇది తెలిసిన టీడీపీ ఎమ్మెల్యేలకు కొత్త భయం పట్టుకుంది. బీజేపీ అధిష్టానం వత్తిడికి తలొగ్గి చంద్రబాబు తమ సీట్లు పొత్తులో భాగంగా ఎక్కడ ఇస్తారోనన్న టెన్షన్ పట్టుకుంది. అయితే వీరిద్దరి మధ్య పోటీలో ప్రతిపక్ష వైసీపీ లాభపడుతుందా? లేదా? అన్నది చూడాలి.

