టీడీపీలో మిగిలింది ఒకే ఒక్కడు?

తెలంగాణ టీడీపీ దాదాపు ఖాళీ అయిందనే చెప్పాలి. మొత్తం పదిహేను మంది ఎమ్మెల్యేలకు ఇప్పుడు ఇద్దరే మిగిలారు. అందులో ఒకరు పార్టీని పట్టించుకోరు. ఇక మిగిలింది ఒకే ఒక్కడు. సండ్ర వెంకట వీరయ్య. తెలంగాణలో టీడీపీ పరిస్థితి నానాటికీ తీసికట్టులా తయారవుతోంది. ఇన్నాళ్లూ అసెంబ్లీలో పసుపు పార్టీ గొంతు వినిపించేందుకు రేవంత్ రెడ్డి ఉన్నాడు. అయితే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిక దాదాపు ఖాయం కావడంతో ఇక అసెంబ్లీలో టీడీపీ గొంతు విన్పించడం కష్టమే. గత ఎన్నికల్లో మొత్తం 15 మంది ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి గెలవగా, అందులో 12 మందిని కేసీఆర్ లాగేసుకున్న సంగతి తెలిసిందే. పార్టీ మారిన వారికీ మంత్రి పదవులిచ్చారు కేసీఆర్. ఈ సమయంలో పార్టీకి అండగా నిలబడింది రేవంత్ ఒక్కరే. ప్రతి శాసనసభ సమావేశాల్లో రేవంత్ సస్పెండ్ కావడం సాధారణ విషయంలానే మారింది. రేవంత్ ను లేచి నిలబడి మాట్లాడిచ్చే పరిస్థితి లేదు. రేవంత్ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తారంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విరుచుకుపడే వారు. వెంటనే సస్పెన్షన్ వేటు పడేది. రేవంత్ తో పాటు మౌనంగా పక్కన నిలబడే సండ్ర వెంకట వీరయ్య కూడా సస్పెన్షన్ కు గురయ్యేవారు. ఇక తెలంగాణ అసెంబ్లీలో టీడీపీకి ఒకే ఒక్కరు మిగిలినట్లయింది.
లీడర్ ఎవరు?
ఇక పార్టీ పరిస్థితి కూడా అంతంత మాత్రమే. ఇప్పటి వరకూ తన మాటలతో... చేతలతో రేవంత్ తెలుగుదేశం పార్టీ ఉనికిని కాపాడుకొస్తూ వస్తున్నారు. కేసీఆర్ పై తరచూ విరుచుకుపడుతుండటంతో ఆయన అందరి దృష్టిలో పడ్డారు. ముఖ్యంగా కేసీఆర్ వ్యతిరేకులకు ఆయన హీరో అయ్యారనే చెప్పొచ్చు. కాని రేవంత్ పార్టీని వీడటంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టిని నడిపేవారు కనుచూపు మేరలో కన్పించడం లేదు. రేవంత్ ప్రస్తుతం టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. అధ్యక్షుడిగా ఎల్. రమణ ఉన్నారు. రమణ నామమాత్రమే. పార్టీ కార్యక్రమాలను ఖరారు చేయాలన్నా, అధికార పార్టీపై విరుచుకుపడాలన్నా రేవంత్ ముందుండేవారు. దీంతో రమణ సారధ్యంలో పార్టీ ముందుకెళ్లడం కష్టమే. అయితే రేవంత్ స్థానంలో మోత్కుపల్లి నరసింహులుకు ఆ బాధ్యతలను అప్పజెబుతారన్న టాక్ కూడా నడుస్తోంది. నేతలు వెళ్లిపోయినా తెలంగాణలో టీడీపీకి బలమైన క్యాడర్ ఉందనడంలో సందేహం లేదు. అయితే ఆ క్యాడర్ మనోభావాలకు అనుగుణంగా లీడర్ ఎక్కడ? అన్నదే ప్రశ్న. మొత్తం మీద రేవంత్ పార్టీ నుంచి వెళ్లిపోతే తెలంగాణ టీడీపీ బలహీన పడుతుందనే చెప్పాలి. రేవంత్ స్థానాన్ని భర్తీ చేసే నేత ఎవరు?
- Tags
- టీడీపీ

