టీడీపీకి షాక్ ఇవ్వనున్న సీనియర్లు...!

టీడీపీలో మరో కీలక నేత పార్టీని వీడనున్నారు. ఈ మేరకు ఆయనకు అన్ని దారులూ సిద్ధమయ్యాయని తెలుస్తోంది. ఇటీవల తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు వరుస బెట్టి పార్టీని వీడుతున్నారు. రెండు రోజుల క్రితం ఎలిమినేటి ఉమా మాధవరెడ్డి, కుమారుడు సందీప్ రెడ్డి పార్టీని వీడిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా టీడీపీలో బలమైన నేతగా ఉన్న రేవూరి ప్రకాశ్ రెడ్డి పార్టీని వీడనున్నట్లు తెలుస్తోంది. ఆయనతోఇప్పటికే ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడారు. కేసీఆర్ తో కూడా రేవూరి చేరికపై కడియం చర్చించారు. కేసీఆర్ కూడా రేవూరి రాకకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రేవూరి ప్రకాశ్ రెడ్డి పార్టీలో చేరితే నర్సంపేట నియోజకవర్గం గాని, వరంగల్ జిల్లాలో మరో చోట గాని వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చేందుకు డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. దీంతో రేవూరి తన అనుచరగణంతో అతి త్వరలోనే గులాబీ కండువాను కప్పేసుకోనున్నారు.
అదే గడ్డ మీద గడ్డు పరిస్థితులు...
రేవూరి ప్రకాశ్ రెడ్డితో పాటు మరో టీడీపీ నేత ఒంటేరు ప్రతాప్ రెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరనున్నారు. ఆయన టీడీపీ రైతు విభాగం అధ్యక్షుడిగా కొనసాగతున్నారు. రేవంత్ రెడ్డికి స్నేహితుడైన ఒంటేరు గత ఎన్నికల్లో గజ్వేల్ లో కేసీఆర్ మీద పోటీ చేశారు. ఈసారి కూడా కాంగ్రెస్ టిక్కెట్ ఒంటేరుకు ఇస్తామని పార్టీ అగ్రనాయకత్వం చెప్పడంతో ఆయన కూడా సెకిల్ కు బై...బై.. చెప్పాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ మరింత డీలా పడుతోంది. పోలిట్ బ్యూరో సభ్యుల నుంచి కిందిస్థాయి నేతల వరకూ పార్టీ జెండాను వీధిలోనే వదిలేసి వెళుతున్నారు. ఎన్నికలకు ఇంకా సమయం లేకపోవడంతో టీటీడీపీ నేతలు తమకు నచ్చిన దారిని తాము చూసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి పార్టీ వీడిన తర్వాత ఇక వలసలు ఉండవని పార్టీ అధినాయకత్వం భావించింది. కాని వలసలు మాత్రం ఆగడం లేదు. చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ ల్లో తెలుగు తమ్ముళ్లకు మనో ధైర్యం కల్పిస్తున్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోతోంది. ప్రస్తుతం తెలంగాణ టీడీపీలో ఇద్దరే ఎమ్మెల్యేలు మిగలడం విశేషం. వారు కూడా రేపో మాపో పార్టీకి గుడ్ బై చెప్పే అవకాశముంది. ఒకప్పుడు తెలంగాణలో బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విభజన తర్వాత క్రమంగా ప్రాభవాన్ని కోల్పోతోందనే చెప్పాలి. చూద్దాం... ఎంత మంది నేతలు వెళతారో? ఎందరు మిగులుతారో?
- Tags
- టీడీపీ

