టీడీపీకి షాక్.. సొంత గూటికి వైసీపీ నేత...!

టీడీపీ నేతలకు షాక్ తగిలింది. వైసీపీ నుంచి వీలైనంత ఎక్కువ మందిని నయానో, భయానో పార్టీలో చేర్చేసుకుని.. ఆ పార్టీ అధినేత జగన్‌ను మానసికంగా దెబ్బతీయాలని టీడీపీ నేతలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కొన్ని చోట్ల నాయకులు విజయం సాధిస్తున్నారు. మరికొన్ని చోట్ల ఇవన్నీ విఫలమవుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ నాయకులపై తీవ్రంగా విరుచుకు పడుతున్న గుడివాడ నియోజకవర్గంలో వైసీపీ నేతలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. ఇందులో గుడివాడ మున్సిపాలిటీలో వైసీపీ ఫ్లోర్ లీడర్‌ను సైకిలెక్కించేశారు. దీంతో టీడీపీ నేతల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అయితే ఇది ఇంతలోనే ఆవిరి అయిపోయింది. ఆయన గోడకు కొట్టిన బంతిలా మరోసారి సొంత గూటికి చేరిపోవడంతో ఇప్పుడు టీడీపీ-వైసీపీ మధ్య మాటల వార్ మొదలైంది.
గుడివాడ ఆపరేషన్ ఫెయిల్....
టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్‌కు వైసీపీ విలవిల్లాడుతోంది. ఇప్పటికే ఇప్పటికే 22 మంది ఎమ్మెల్యేలు, పలువురు నేతలు అధికార తెలుగుదేశం పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఇంకో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్న వార్తలు వెలువడుతున్నాయి. ఇదే తరుణంలో ద్వితీయ శ్రేణి నాయకులను కూడా సైకిలెక్కించేందుకు టీడీపీ నేతలు ప్రణాళికలు వేస్తున్నారు. ఈ ఆపరేషన్ ఆకర్ష్‌లో చాలా వరకు ప్రలోభాలతో పాటు ఇలా పనవ్వని చోట్ల టీడీపీ వాళ్లు బెదిరింపులకు కూడా దిగి, తీవ్రంగా ప్రెజర్ చేసి వైసీపీ వాళ్లు టీడీపీలో చేరినట్టు తాజా సంఘటనలే చెప్పేస్తున్నాయ్. ముఖ్యంగా కృష్ణాజిల్లాలో వైసీపీ బలంగా ఉన్న గుడివాడపై ప్రత్యేక దృష్టి పెట్టారు! ఇందులో భాగంగా గుడివాడ మునిసిపాలిటీలో వైసీపీ ఫ్లోర్ లీడర్‌గా ఉన్న రవికాంత్ వారం రోజుల క్రితం టీడీపీ కండువా కప్పేసుకున్నారు.
ప్రలోభపెట్టారంటూ...
మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సమక్షంలో రవికాంత్ సైకిలెక్కేశారు. ఇక వైసీపీ దెబ్బతినడం ఖాయమని, ఆ పార్టీ నుంచి వలసలు నెమ్మదిగా మొదలవుతాయనే ఆశతో టీడీపీ నేతలు ఉన్నారు. అయితే ఇప్పుడు వీరి ఆశలన్నీ అడియాశలయ్యాయి. గోడకు కొట్టిన బంతి ఎంత వేగంగా వెనక్కువస్తుందో అంతకు రెట్టింపు వేగంతో రవికాంత్ మళ్లీ సొంత గూటికిచేరిపోవడం టీడీపీ నేతలు విస్మయానికి గురయ్యారు. నియోజకవర్గ ఎమ్మెల్యే కొడాలి నాని నిర్వహించిన సమావేశంలో పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచారు. టీడీపీ నేతలు తనను ఏ విధంగా ప్రలోభపెట్టారో ఆధారాలతో సహా త్వరలోనే బయటపెడతానని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ నాయకులను ప్రలోభ పెట్టి రాజకీయం చేస్తే ఇలాంటి సంఘటనలే జరుగుతాయని ఎమ్మెల్యే కొడాలి నాని హెచ్చరించారు.
ఇప్పుడు సైలెంట్ గా ఉన్నా....
కొద్ది రోజులుగా గుడివాడలో కొడాలి నానిని దెబ్బకొట్టేందుకు టీడీపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. అక్కడ స్థానిక వైసీపీ వాళ్లను బెదిరింపులు, ప్రలోభాలకు గురి చేసి టీడీపీలో చేర్చేసుకుంటున్నారు. ఈ విధానం ఒక్క గుడివాడలోనే కాదు... రాష్ట్రం మొత్తం అమలవుతోంది. వీరిలో కొందరు అక్కడ వేగలేక తిరిగి సొంత గూటికే చేరిపోతున్నారు. ప్రస్తుతం టీడీపీకి అధికారం ఉండడంతో కొద్ది రోజుల పాటు సైలెంట్‌గా ఉన్నా ఎన్నికలకు ముందు అయినా వీరిలో మళ్లీ చాలా మంది రివర్స్ జంపింగ్‌లకు రెడీ అవుతున్నారు.
- Tags
- టీడీపీ వైసీపీ

