టీఆర్ఎస్ దే విజయం

సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో కారు దూసుకెళ్లింది. టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. టీఆర్ఎస్ అనుబంధ సంఘమైన తెలంగాణ బొగ్గు గని కార్మికుల సంఘం 11 డివిజన్లలో తొమ్మిదింటిని కైవసం చేసుకుని విజయఢంకా మోగించింది. అర్ధరాత్రి వరకూ జరిగిన కౌంటింగ్ వన్ సైడ్ గానే జరిగింది. ఇప్పటికే గుర్తింపు సంఘంగా ఉన్న టీబీజేకేఎస్ మరోసారి ఆ హోదాను దక్కించుకుంది. ముఖ్యంగా నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత గౌరవాధ్యక్షురాలిగా కొనసాగుతున్న ఈ సంఘం సింగరేణి ఎన్నికల్లో గెలుపొందడంతో ఆ పార్టీ నేతలు సంబరాలుచేసుకున్నారు.
గులాబీ శ్రేణుల సంబరాలు......
సింగరేణి కార్మికసంఘం ఎన్నికలను అధికార పక్షం, విపక్షం రెండూ ప్రతిష్టాత్మకంగానే తీసుకున్నాయి. మందమర్రి, భూపాలపల్లి డివిజన్లలో ఏఐటీయూసీ విజయం సాధించింది. మిగిలిన తొమ్మిది డివిజన్లను అధికార పార్టీ అనుబంధ సంఘం కైవసం చేసుకుంది. విపక్షాలన్నీ ఏకమైనా ఈ ఎన్నికల్లో అవి చతికలపడ్డాయనే చెప్పకతప్పదు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి కార్మికులపై వరాల జల్లు ప్రకటించారు. దీంతో పాటు ఎంపీ కవిత అక్కడే ఉండి ప్రచారాన్ని నిర్వహించారు. విపక్ష సంఘాలకు చెందిన నేతలను తమ పార్టీలో చేర్చుకుని వాటికి సవాల్ విసిరారు. మొత్తం మీద తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం విజయం సాధించడంతో గులాబీ శ్రేణుల్లో ఆనందం వెల్లువెత్తుతోంది. ఫలితాలు వచ్చేంతవరకూ సీఎం కేసీఆర్ క్యాంప్ కార్యాలయంలోనే ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకున్నారు.

