టిడిపి అవిశ్వాసం పెట్టకపోతే ...?

ఏపీ లో మిత్రుల నడుమ చిత్ర విచిత్ర పరిస్థితి నడుస్తుంది. ప్రత్యర్థులకన్నా దారుణంగా బిజెపి, టిడిపి ల నడుమ యుద్ధం నడుస్తున్నా ఇద్దరూ అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ ప్రభుత్వాల్లో భాగస్వాములుగా ఉన్నారు. ఈ విచిత్రం విడ్డూరం ఎన్నడూ రాష్ట్రంలో ప్రజలు చూడలేదు. ఇరు పార్టీలు తమ మంత్రి పదవులు వెంట్రుక సమానమని, నిమిషంలో రాజీనామా చేసి పారేస్తాం అంటూనే వాటిలో హాయిగా కొనసాగుతున్నారు. దాంతో కేంద్రంలోని బిజెపిని రాష్ట్రంలోని టిడిపి చెప్పే మాటలను, చేసే పోరాటాలను ప్రజలు పరిగణలోనికి తీసుకోవడం లేదని విశ్లేషకులు విమర్శలపై విమర్శలు చేస్తున్నారు. ఒకరిపై మరొకరు దారుణమైన విమర్శలు చేసుకుంటూ మంత్రి పదవులనుఅట్టిపెట్టుకోవడాన్ని ఏ ఒక్కరు అర్ధం చేసుకోలేని రాజకీయాలు నడుస్తున్నాయనే వ్యాఖ్యలు తీవ్రమౌతున్నాయి.
మొన్నటివరకు రాజీనామాలు ... ఇప్పుడు అవిశ్వాసం ...
నిన్న మొన్నటివరకూ ఎంపీల రాజీనామా అన్ని పార్టీల్లో ప్రధాన డిమాండ్ కాగా జనసేన అధినేత దమ్ముంటే అవిశ్వాసం పెట్టాలంటూ అధికార టిడిపి పార్టీని వదిలి వైసిపి పెట్టాలనడం చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ ఇంకా టిడిపిని అంటిపెట్టుకునే రాజకీయాలే నడుపుతున్నారన్న విమర్శలు తీవ్రం అయ్యాయి. మరోవైపు టిడిపి అవిశ్వాసానికి దూరంగా వున్నా అది ఆఖరి అస్త్రం అంటూ చేసే ప్రచారాలు ఆ పార్టీ పుట్టిముంచే ప్రమాదాన్ని సూచిస్తున్నాయి. కేంద్రప్రభుత్వంలో భాగస్వామిగా వుంటూ పోరాటం చేస్తామనే తీరులో టిడిపి రాజకీయాలు చేసినంత కాలం ఆ పార్టీకి ప్రజల్లో విశ్వసనీయత సన్నగిల్లుతుందంటున్నారు విశ్లేషకులు. పార్లమెంట్ బయట టిడిపి ఎంత అల్లరి చేసినా లోక్ సభ రాజ్యసభలో ఆ పార్టీ నడుచుకునే తీరును అంతా గమనిస్తున్నారని వైసిపి కన్నా ముందే టిడిపి అవిశ్వాస ప్రతిపాదన చేస్తే రాష్ట్రానికి మేలు చేకూరుతుందన్న అభిప్రాయాలు సోషల్ మీడియా లో సైతం నెటిజెన్లు సంధిస్తున్నారు.
అవిశ్వాసం పెట్టి చర్చలో పాల్గొంటే ...
టిడిపి కేంద్రంలోని మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా అవిశ్వాసాన్ని పెట్టి చర్చలో పాల్గొంటే ఇక అక్కడితో ఆ పార్టీతో పొత్తుకు రాం.. రాం చెప్పినట్లే. వెంటనే కేంద్రంలోని టిడిపి కి చెందిన ఇద్దరు మంత్రులు రాజీనామా చేయాలిసి వస్తుంది. నైతికంగా ఇది తప్పని పరిస్థితి కల్పిస్తుంది. టిడిపి అలా చేసిన వెంటనే రాష్ట్రంలోని బిజెపి మంత్రులు తమ పదవులను అనివార్యంగా వదులుకోక తప్పదు. ఎన్నికలకు ఏడాది ముందే మంత్రి పదవులను విడిచిపెట్టడం అనేది రెండు పార్టీలకు ఏ మేరకు మైలేజ్ తెస్తోందన్న సంగతి పక్కన పెడితే ఏపీకి రావాలిసినవి రాకుండా పోయే అవకాశాలు ఉన్నట్లు టిడిపి వర్గాలు ఆందోళన చెందుతున్నాయి . అందుకే ఆ పార్టీ అధినేత అవిశ్వాసాన్ని ఆఖరి అస్త్రమని అది పెట్టినా ప్రయోజనం లేదనే వాదన తెరపైకి తెచ్చారంటున్నారు. దాంతో ఆయన వ్యాఖ్యలే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. కేంద్రంతో రాజకీయ సంబంధాలు సన్నగిల్లిన నేపథ్యంలో అధికార టిడిపి పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా మారిపోయింది.
- Tags
- టీడీపీ అవిశ్వాసం

