టిడిపికి మరింత విషమ పరిస్థితి ...?

ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా చేసిన ఒక ప్రకటన టిడిపి గుండెల్లో రైళ్ళు పరిగెట్టిస్తోంది. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ నడుమ వుండే బుందేల్ ఖండ్ క్యారిడార్ కి ప్రధాని 20 వేలకోట్ల రూపాయల ప్యాకేజి ప్రకటించడమే టిడిపి సర్కార్ ని ఆందోళనకు గురిచేసింది. ఒక పక్క తీవ్ర స్థాయిలో పోరాడుతున్నాం అని ప్రకటించి పార్లమెంట్లో నా నా అల్లరి చేసినా పైసా కేంద్రం విదల్చకపోవడంతో డీలా పడ్డ ఏపీ సర్కార్ కి ప్రధాని ప్రకటన ఈ సమయంలో చేయడం జనంలో మైలేజ్ ను మరింత కిందకు తీసుకువెళ్ళే పరిస్థితి తెచ్చి పెట్టింది. కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏమాత్రం లెక్క చేయడం లేదని ఎన్ని ఉద్యమాలు చేసినా పట్టించుకోవాలిన పనే లేదన్న రీతిలో ప్రధాని బుందేల్ ఖండ్ కి ఇచ్చిన వరం అనేక చర్చలకు దారితీసింది.
ప్రధాని పై విరుచుకుపడిన అచ్చెన్నాయుడు ...
ప్రధాని తాజా ప్రకటనపై టిడిపి నుంచి మంత్రి అచ్చెన్నాయుడు స్పందిస్తూ ఫైర్ అయ్యారు. ఇదెక్కడి న్యాయం అంటూ ఆయన నిలదీశారు. ఏపికి కొత్తగా తాము కోరింది ఏమిలేదని చట్టంలో చేసిన హామీలు, పార్లమెంట్లో నాటి ప్రధాని ఇచ్చిన వరాలు అమలు చేయమంటే పట్టించుకోకుండా ఎపి పట్ల నమ్మకద్రోహం చేశారని వాపోయారు మంత్రి. ఇక ఈ వ్యవహారాన్ని చూస్తూ ఊరుకోమని పార్టీతో చర్చిస్తామని కేంద్రం తీసుకుంటున్న చర్యలు ఆంధ్రుల మనసులను మరింత గాయం చేసేదిశగా సాగుతున్నాయని ధ్వజమెత్తారు.
నిధులు వచ్చే వరకు, తెచ్చే వరకు...
మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నిధులు తెచ్చి తీరతామని కేంద్రం ఎందుకు ఇవ్వదో తేల్చుకుంటామన్నారు. ఏపీ కి న్యాయం చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనని, చేసే వరకు పోరాడాలిసిన బాధ్యత రాష్ట్రానిదేనని కర్ర విరక్కుండా పాము చావకుండా వ్యాఖ్యానించారు. బిజెపితో పొత్తు అంశంలో కానీ అవిశ్వాసం అంశాలపై బాబు వెళ్లకుండా జాగ్రత్త పడ్డారు. చివరి వరకు పోరాటమే తమ లక్ష్యమని బాబు పదే పదే ప్రతి వేదికమీద చెప్పుకురావడం గమనార్హం. ఒక పక్క అవిశ్వాసం కేందంపై ప్రవేశపెట్టాలని అన్ని పార్టీలనుంచి వత్తిడి వస్తుండటం, పొత్తు నుంచి బయటకు రావాలన్న ప్రజల వత్తిడి నుంచి తప్పించుకునేందుకు సీఎం కొత్త వ్యూహాలు రూపొందిస్తున్నట్లు ఆయన వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. మరి ఆయన తన పోరాటంలో కొత్త అస్త్రాలు ఎలాంటివి ప్రయోగించి కేంద్రాన్ని నేలకు దించుతారో చూడాలి. అలాగే ఆపార అనుభవజ్ఞుడి వ్యూహాలు ఏ మేరకు ఫలిస్తాయో రాబోయే రోజులే తేల్చనున్నాయి.

