జైలులో చంద్రబాబు : ముచ్చట్లు, భరోసాలు

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. జైళ్లలో శిక్షలు పరివర్తన తీసుకువచ్చే దిశగా సాగాలని అన్నారు. జైళ్లలో మరిన్ని సంస్కరణలు తేవడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కూడా చెప్పారు. అయితే చంద్రబాబు నాయుడు పర్యటన ఎక్కువగా.. సీఎం సాగించిన అధికారిక పర్యటన ప్రసంగాలు మాత్రమే కాకుండా.. ఖైదీలతో కలివిడిగా ఉంటూ.. వారి కష్టాలను, వారు చేసిన నేరాలను, శిక్షకు దారితీసిన పరిస్థితులను తెలుసుకుంటూ.. వారికి ముచ్చట్లు చెబుతూ, వారికి జీవితం పట్ల భరోసా కలిగేలా విశ్వాసం కలిగేలా ధైర్యం చెబుతూ సాగింది.
రాజమండ్రి సెంట్రల్ జైలులో చేతివృత్తులు, వ్యవసాయం ద్వారా ఖైదీలు చేస్తున్న ఉత్పత్తు అన్నింటినీ చంద్రబాబునాయుడు పరిశీలిస్తూ వారితో చాలా సమయం గడిపారు.
చంద్రబాబు కోసం ఖైదీలు ఓ ముచ్చటైన కానుకను కూడా అందివ్వడం విశేషం. ఖైదీలు తనకోసం ప్రత్యేకంగా ఓ కుర్చీని కానుకగా ఇవ్వడానికి వారే తయారు చేయడాన్ని చంద్రబాబు అభినందించారు. వారు తయారు చేసిన కుర్చీలో కూర్చుని, దాన్ని చేసిన పనివాళ్లను అభినందించారు. ఫర్నిచర్ ను ఇంకాస్త ఆధునికంగా తయారు చేయడానికి కొన్ని సూచనలు కూడా చేశారు. మొత్తానికి జైలులో ఖైదీలతో చంద్రబాబు గడిపిన సమయం.. మరీ అధికారిక పర్యటనలాగా కాకుండా... వారితో సమయం గడిపినట్లుగా సాగింది. వారి కష్టాలన్నిటినీ తెలుసుకుంటూ, వారి శిక్షలకు దారితీసిన పరిస్థితుల్ని కూడా తెలుసుకుంటూ ఇంటరాక్ట్ అయినందుకు పలువురు సంతోషించారు.

