జయ వీడియో ఇంత పనిచేసిందా?

దినకరన్ తొలి నుంచి ఆర్కే నగర్ ఉప ఎన్నికలపై కన్నేశారు. జయ మరణం తర్వాత పార్టీలోకి ఎంటర్ అయిన ఆయన ఆ నియోజకవర్గంలో పట్టుకోసం తీవ్రంగానే ప్రయత్నించారు. జయలలిత బతికున్న సమయంలో దినకరన్ ను పార్టీ కార్యాలయానికి, పోయెస్ గార్డెన్ వైపుకు కూడా రానివ్వలేదు. అయితే జయ మరణానంతరం ఆయన తిరిగి పార్టీలో కీలక వ్యక్తిగా మారిపోయాడు. మేనత్త శశికళకు అత్యంత నమ్మకస్తుడిగా ఉన్న దినకరన్ కు శశికళ పార్టీలో ముఖ్యమైన పదవిని అప్పగించి జైలుకు వెళ్లారు.
దూకుడుకు కారణాలివే....
అయితే దినకరన్ పళనిస్వామి వర్గాన్ని టార్గెట్ చేయడంతో కొంత విభేదాలు తలెత్తాయి. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో డబ్బులు విపరీతంగా పంచడం, పార్టీ, గుర్తు కోసం ఎన్నికల కమిషన్ కు లంచాలను ఎరచూపడం వంటి కారణాలతో దినకరన్ వర్గాన్ని పళనిస్వామి దూరంగా పెట్టి పన్నీర్ సెల్వాన్ని దరిచేర్చుకున్నారు. బీజేపీ పెద్దల ఆశీస్సులతోనే చిన్నమ్మ ఫ్యామిలీని పార్టీ నుంచి గెంటి వేశారు. దీంతో దినకరన్ పళనిస్వామి వ్యతిరేక వర్గీయులను కూడగట్టడం ప్రారంభించారు. దాదాపు 20 మంది ఎమ్మెల్యేలతో క్యాంప్ ను కూడా దాదాపు నెల రోజుల పాటు నడిపారు. అయితే స్పీకర్ వీరిపై అనర్హత వేటు వేయడంతో కోర్టు మెట్లు ఎక్కింది దినకరన్ వర్గం
ఐటీ దాడులు కూడా....
అయితే దినకరన్, శశికళ వర్గీయులపై వరుసగా ఆదాయపు పన్ను శాఖ దాడులు జరగడంతో ఆర్కే నగర్ లో శశికళ ఫ్యామిలీపై సిింపతీ పెరిగిందంటున్నారు. అమ్మ జయలలితకు రెండు దశాబ్దాలు సేవలందించిన చిన్నమ్మను కావాలనే కేసులో ఇరికించి జైలుకు పంపారని ఆర్కే నగర్ ప్రజలు భావించినట్లుంది. దీంతో పాటు డబ్బులు కూడా మన్నార్ గుడి మాఫియా విపరీతంగా పంచిందంటున్నారు. మరోవైపు జయలలిత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పాలుతాగుతున్న వీడియో కూడా పోలింగ్ కు ఒక రోజు ముందు దినకరన్ వర్గం విడుదల చేయడం ఆయనకు కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు. మొత్తం మీద దినకరన్ దూసుకుపోవడానికి కారణాలను విశ్లేషిస్తే ఎక్కువగా సింపతీ వర్క్ అవుట్ అయిందనే చెప్పాలి. ఎందుకంటే నియోజకవర్గ అభివృద్ధి కోసం అధికార పార్టీని కాదని దినకరన్ కు ఓటు వేశారంటే సానుభూతి రూపంలోనే ఓట్ల వర్షం కురిసిందన్న విశ్లేషణలు విన్పిస్తున్నాయి.

