జయ మృతిపై శశికళ మాటల్లో వాస్తవముందా?

తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత మరణం ఇప్పటికీ అనుమానాస్పదమే. జయలలిత 70 రోజుల పాటు ఆసుపత్రిలో ఉండి చికిత్స పొందుతూ మరణించారు. ఆమె మరణంపై అనేక అనుమానాలు తొలి నుంచి వస్తున్నాయి. అమ్మ జయలలిత చనిపోవడానికి కారణం ఆమె నెచ్చెలి శశికళ అంటూ కొందరు శాపనార్థాలు కూడా పెట్టారు. అయితే తమిళనాడు ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిపై కమిషన్ ను విచారణకు నియమించింది. హైకోర్టు మాజీ జడ్డి జస్టిస్ ఆర్ముగ స్వామి నేతృత్వంలో ఈ కమిషన్ అందరినీ విచారిస్తోంది.
అనేక అనుమానాలు....
అయితే జయలలిత నెచ్చెలి శశికళ చెప్పిన విషయాలు పలు అనుమానాలకు దారితీస్తున్నాయంటున్నారు. కమిషన్ ఎదుట జయలలిత చికిత్స గురించి శశికళ అనేక విషయాలను వెల్లడించారు. 2016 సెప్టంబరు 22న జయలలిత పోయెస్ గార్డెన్ లోని బాత్ రూమ్ లో కళ్లు తిరిగి పడిపోయారన్నారు. తాను వెంటనే అపోలో ఆసుపత్రికి చెందిన ప్రీతిరెడ్డి భర్తకు ఫోన్ చేసి ఆంబులెన్సును పంపించమని కోరానన్నారు. ఆంబులెన్స్ లో అపోలోకు తీసుకెళుతుండగా జయకు స్పృహ వచ్చిందన్నారు. తనను ఎక్కడకు తీసుకెళుతున్నారని జయ తనను ప్రశ్నించారని, ఆసుపత్రికి వెళుతున్నామని చెప్పానన్నారు. తీవ్ర జ్వరంతో ఉన్న జయలలితను ఆసుపత్రికి రావాలని చెప్పినా జయ అంతకు ముందు నిరాకరించారని చెప్పారు.
బాత్ రూమ్ లో పడిపోవడంతో....
జ్వరం ఎక్కువగా ఉండటం వల్లనే జయలలిత బాత్ రూమ్ లో బ్రష్ చేస్తూ స్పృహ తప్పి పడిపోయారని వైద్యులు చెప్పారన్నారు. ఆరోజు ఉదయమే వైద్యుడు శివకుమార్ రెండుసార్లు జయను పరీక్షించారని చెప్పారు. అక్రమాస్తుల కేసు విషయంలోనే జయలలిత తీవ్ర వత్తిడికి గురయ్యారని తెలిపారు. ఆమెకు వైద్యుల సూచన మేరకు తక్కువ డోస్ ఉన్న స్టెరాయిడ్స్ ఇచ్చారని శశికళ విచారణ కమిషన్ ఎదుట అంగీకరించారు. ఆసుపత్రిలో జయలలితకు అనేక వైద్య పరీక్షలు నిర్వహించారని, మెరుగైన వైద్యం అపోలో వైద్యులు అందించారని పేర్కొన్నారు.
జయను చాలామంది చూశారు...
కాని జయలలిత 70 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందినప్పటికీ ఆమెను చూసేందుకు ఎవరినీ అనుమతించ లేదన్నది ప్రధాన ఆరోపణ. ముఖ్యంగా గవర్నర్, కేంద్రమంత్రులు, రాహుల్ గాంధీ వంటి వారు కూడా జయ చికిత్స పొందుతున్న గదిలోకి వెళ్లలేదన్న వార్తలు అప్పట్లో వచ్చాయి. అయితే శశికళ మాత్రం కమిషన్ ఎదుట దీనికి భిన్నంగా సమాధానమిచ్చారు. అక్టోబర్ 22న అప్పటి గవర్నర్ విద్యాసాగర్ రావు జయలలితను చూశారన్నారు. గవర్నర్ ను చూసిన జయలలిత చేయి కూడా ఊపారని తెలిపారు. అలాగే అన్నాడీఎంకే నేతలు పన్నీర్ సెల్వం, తంబిదురై, విజయభాస్కర్ లు కూడా జయను చూశారని శశికళ కమిషన్ ఎదుట చెప్పారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడే నాలుగు సార్లు జయ అనుమతితోనే వీడియోలో తీశామన్నారు. అయితే శశికళ చెప్పినట్లుగా జయను శశికళ తప్ప ఎవరూ చూడటం లేదని చెబుతున్నారు. మరి శశికళ విచారణ కమిషన్ ఎదుట అలా ఎందుకు చెప్పారన్న విషయం తమిళనాడులో చర్చనీయాంశంగా మారింది. శశికళ అవాస్తవాలు చెబుతున్నారా? లేక జయను చూసి వచ్చిన నేతలు అసత్యాలు మాట్లాడుతున్నారా? అన్నది తేలాల్సి ఉంది.
