జనసేన దూసుకెళుతుందే?

సభ్యత్వాల నమోదుపైన జనసేన దృష్టి సారించింది. త్వరలోనే జనసేన సభ్యత్వ నమోదును ఆ పార్టీ ప్రారంభించడానికి అన్నీసిద్ధం చేసింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే సభ్యత్వ నమోదుకు సిద్ధమవుతామని జనసేన వర్గాలు చెబుతున్నాయి. పూర్తిగా ఆన్ లైన్ లోనే సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుంది. ముఖ్యంగా సభ్యత్వనమోదుకు విపరీతంగా రెస్పాన్స్ వచ్చే అవకాశముందని జనసేన వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా ఏపీలోని 13 జిల్లాల్లో ఇప్పటికే జనసైనికుల ఎంపికలు పూర్తయ్యాయి. వారికి శిక్షణ ఇచ్చే కార్యక్రమం కూడా త్వరలో ప్రారంభం కానుంది. అంతేకాకుండా మహిళ, విద్యార్థి విభాగాలు, ఐటీ విభాగాల ఎంపిక కూడా పవన్ కల్యాణ్ స్వయంగా ఎంపిక చేశారు. మిగిలిన అనుబంధ సంఘాలను కూడా త్వరలోనే నియమించనున్నారు.
సభ్యత్వ నమోదు ఆన్ లైన్ లోనే.....
దీంతోనే హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయాన్ని ఆధునికీకరిస్తున్నారు. అన్ని అనుబంధసంఘాలకు చోటు ఉండే విధంగా కార్యాలయాన్ని తీర్చిదిద్దుతున్నారు. అక్టోబర్ నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని పవన్ కల్యాణ్ ప్రకటించారు. కాని ఈ నెలలో పవన్ రథయాత్ర ప్రారంభమయ్యే అవకాశం లేదు. వచ్చే నెలలో పవన్ పర్యటన ఉంటుందని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. పవన్ పర్యటనకు ముందే సభ్యత్వాలు ముమ్మరంగా నమోదు చేయాలన్నది ఆ పార్టీ ఆలోచన. అందుకు అనుగుణంగానే ఐటీ విభాగాన్ని పటిష్ట పరిచారు. సోషల్ మీడియా ద్వారా పార్టీని జనంలోకి తీసుకెళ్లాలన్నది పవన్ వ్యూహం. అందుకోసం ఇప్పటికే జనసేన వెబ్ సైట్, జనసేన యూట్యూబ్, ట్విటర్లను ఉపయోగించుకుంటున్నారు. సభ్యత్వ నమోదుకు సంబంధించి పవన్ నుంచి క్లారిటీ రాగానే ప్రారంభిస్తామని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద జనసేన జనంలోకి దూసుకెళ్లడానికి ప్రయత్నాలు ప్రారంభించింది.
- Tags
- జనసేన

