జనం చెంతకు జగన్ ఇలా?

ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లా చేయడమే వైసీపీ ఉద్దేశ్యంగా ఉంది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో జిల్లాల సంఖ్య పెరిగాయి. గతంలో పది జిల్లాలు ఉన్న తెలంగాణలో ఇప్పుడు 30 జిల్లాలకు చేరుకున్నాయి. కాని ఏపీలో మాత్రం పదమూడు జిల్లాలు మాత్రమే ఉన్నాయి. అధికార వికేంద్రీకరణ జరిగితే తప్ప ప్రజా సమస్యలు పరిష్కారం కావని జగన్ అభిప్రాయపడుతున్నారు. గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్న జగన్ వైసీపీ అధికారంలోకి వస్తే ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాను చేస్తానని హామీ ఇచ్చారు. బాపట్లను కూడా జిల్లా కేంద్రంగా చేస్తామని జగన్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
జిల్లాల పెంపుదల....
జిల్లాలకు నిధులు కేటాయిస్తున్నప్పటికీ జిల్లా కేంద్రంపై చూపిన శ్రద్ధ మిగిలిన పట్టణాలపై ప్రభుత్వం చూపడం లేదన్నారు. జిల్లా కేంద్రాల్లోనే జనసాంద్రత ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణమన్నారు. ప్రతి మండల కేంద్రాన్ని అభివృద్ధి చేస్తే జిల్లా కేంద్రానికి ప్రజలు ఎందుకు వలస వస్తారని ప్రశ్నించారు. ఇలా జగన్ తన పాదయాత్రలో జిల్లా పెంపును ప్రజల్లోకి బలంగా తీసుకెళుతున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు జరగకపోయినప్పటికీ, జిల్లాల పెంపు చేస్తామని ఆయన చెబుతున్నారు. జిల్లా కేంద్రం ఏర్పడితే ప్రజలకు చేరువలో ప్రభుత్వ కార్యాలయాలుంటాయని, సమస్యలను వేగవంతంగా పరిష్కరించవచ్చని చెబుతున్నారు.
వినతుల వెల్లువ....
గుంటూరు జిల్లాలో జరుగుతున్న జగన్ పాదయాత్రకు అడుగడుగునా ప్రజలు సమస్యలతో కూడిన వినతి పత్రాలను అందజేస్తున్నారు. వ్యక్తిగత సమస్యలతో పాటు, సామాజిక సమస్యలను కూడా జగన్ దృష్టికి తెస్తున్నారు. ఎక్కువగా తమకు పింఛను అందడం లేదనే సమస్యలు జగన్ చెంతకు వస్తున్నట్లు చెబుతున్నారు. పింఛన్లు కేవలం జన్మభూమి కమిటీలు నిర్ణయించిన వారికే ఇస్తున్నారని, పార్టీ కార్యకర్తలకు, సానుభూతి పరులకే పింఛన్లు దక్కుతున్నాయన్నది జగన్ ఆరోపణ. ఇక వ్యవసాయ విద్యుత్తు ఛార్జీలు పెరిగిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యాభై రూపాయల సర్వీస్ ఛార్జితో ఉచిత విద్యుత్తు ఇచ్చేవారని, కాని ఇప్పుడు నెలకు రెండు వేలు విద్యుత్తు ఛార్జీలు వస్తున్నాయని రైతులు వాపోయారు. అలాగే పక్కా గృహాలను కూడా కొందరికే మంజూరు చేస్తున్నారని కొందరు మహిళలు వైఎస్ జగన్ కు విన్నవించుకున్నారు.
నేతలంతా ఐక్యంగా.....
గుంటూరు జిల్లాలో జగన్ యాత్రకు మంచి స్పందనే లభిస్తుంది. వైసీపీ నేతలందరూ కలిసికట్టుగా యాత్ర విజయవంతానికి కృషి చేస్తున్నారు. అందరు నేతలూ ఐక్యంగా జగన్ పాదయాత్రలో పాల్గొంటున్నారు. ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ముస్తఫా, గుంటూరు, బాపట్ల పార్లమెంటరీ జల్లా పార్టీ అధ్యక్షులు రావి వెంకటరమణ, మోపీదేవి వెంకటరమణ, లేళ్ల అప్పిరెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయలు, నందిగం సురేష్ బాబు తదితరులు జగన్ పాదయాత్రలో పాల్గొంటున్నారు.
- Tags
- జగన్ పాదయాత్ర
