జగన్ సగం దాటేశారు

వైసీపీ అధినేత జగన్ ఇప్పటికి సగం దూరం దాటేశారు. జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర మొత్తం 13 జిల్లాల్లో పర్యటించాల్సి ఉండగా ఇప్పటికి ఇప్పటికి ఏడు జిల్లాల్లో యాత్ర సాగింది. గత ఏడాది నవంబరు 6వ తేదీన కడప జిల్లాలోని ఇడుపుల పాయ నుంచి జగన్ ప్రజాసంకల్ప యాత్రను ప్రారంభించారు. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో జగన్ పాదయాత్ర పూర్తయింది. ప్రస్తుతం గుంటూరు జిల్లాలో యాత్ర కొనసాగుతోంది. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ ప్రజాసంకల్పయాత్ర జరగాల్సి ఉంది. మొత్తం మూడువేల కిలోమీటర్లు జగన్ పాదయాత్ర చేయాల్సి ఉంది.
1500 కిలోమీటర్లు పూర్తి....
అయితే ఇప్పటికి జగన్ అందులో సగం యాత్రను పూర్తి చేశారు. 1500 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేశారు. గుంటూరు జిల్లాలోని పొన్నూరు నియోజకవర్గంలోని ములుకుదురు వద్ద సగం యాత్ర పూర్తయింది. ఈ సందర్బంగా జగన్ అక్కడ మొక్కను నాటారు. ప్రతి వంద కిలోమీటర్ల వద్ద జగన్ మొక్కను నాటుతూ వస్తున్నారు. వెయ్యి కిలోమీటర్లు నెల్లూరు జిల్లా సైదాపురంలో పూర్తవ్వగా అక్కడ పైలాన్ ను ఆవిష్కరించారు. జగన్ మొత్తం 180 రోజుల పాటు 125 నియోజకవర్గాల్లో పర్యటించాల్సి ఉంది.
ఎండలు ముదరడంతో....
కాగా ఎండలు ముదరడంతో ప్రజాసంకల్ప పాదయాత్ర కొంత నెమ్మదిగా సాగుతోంది. ఉదయం పాదయాత్రను ప్రారంభించే జగన్ పది గంటలకే ముగిస్తున్నారు. తర్వాత తిరిగి మధ్యాహ్నం 2.45గంటలకు యాత్రను ప్రారంభిస్తున్నారు. దీంతో రోజుకు 12 నుంచి 13కిలోమీటర్ల మేరకే పాదయాత్ర సాగుతోంది. మొన్నటివరకూ రోజుకు 15 కిలోమీటర్ల మేర జగన్ పాదయాత్ర చేసేవారు. రోజుకూ మూడు కిలోమీటర్లు తగ్గడంతో అనుకున్న దానికంటే మరో ఇరవై రోజుల సమయం అధికంగా పడుతుందని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి.
- Tags
- జగన్ పాదయాత్ర
