జగన్ వారి మధ్య గ్యాప్ తొలగించేందుకు....!

నెల్లూరు జిల్లా నేతలు ఐక్యంగా వైసీపీ అధినేత జగన్ అడుగులో అడుగు వేశారు. విభేదాలున్న నియోజకవర్గాల్లో కూడా జగన్ పాదయాత్ర వారిలో మార్పు తీసుకొచ్చింది. విభేదాలను పక్కనపెట్టి మరీ జగన్ వెంట నడిచారు. నెల్లూరు జిల్లాలో జగన్ పాదయాత్ర ప్రారంభమవుతుందనుకున్న సమయంలో పార్టీలో విభేదాలు బట్టబయలు అవుతాయని అందరూ భావించారు. కాని జగన్ స్వయంగా జోక్యం చేసుకుని నేతల మధ్య ఐక్యతను తీసుకొచ్చారు. టిక్కెట్ వస్తుందో ? రాదో? అన్న అనుమానం ఉన్న నేతలకు కూడా జగన్ హిత బోధ చేశారు.
ప్రతిరోజూ సమావేశం.....
ప్రతి రోజూ సాయంత్రం పాదయాత్ర ముగిసిన తర్వాత జగన్ స్థానిక నేతలతో భేటీ అవుతుండటం గత రెండు నెలలుగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇదే సమావేశాల్లో విభేదాలున్న నేతలిద్దరినీ కూర్చోబెట్టి మరీ వారి మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించగలిగారు. ఇప్పటికే జగన్ పాదయాత్ర నెల్లూరు జిల్లాలో గూడూరు, సర్వేపల్లి, నెల్లూరు రూరల్, కోవూరు, ఆత్మకూరు, కావలి, ఉదయగిరి నియోజకవర్గాల్లో జరిగింది. ఈ నియోజకవర్గాల్లో నేతల మధ్య గతకొంతకాలంగా ఉన్న గ్యాప్ ను జగన్ తొలగించగలిగారు. అంతేకాకుండా పార్టీలో నేతలను చేర్చుకుని కొత్త జోష్ నింపారు. ముఖ్యంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి పార్టీ కండువా కప్పడంతో నెల్లూరు జిల్లాల్లో వైసీపీ నేతలు మరింత ఉత్సాహంగా విభేదాలను పక్కన పెట్టి మరీ యాత్ర విజయవంతానికి కృషి చేశారు.
ఆ ఇద్దరూ కలసి...నడిచి....
కావలి నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఒంటేరు వేణుగోపాల్ రెడ్డిని పిలిపించుకుని మాట్లాడారు. ఎన్నికల ముందు విభేదాలు వద్దని హితవు పలికారు. ఇద్దరిలో ఒకరికి టిక్కెట్ వచ్చినా...మరొకరికి అన్యాయం చేయనని, అధికారంలోకి వచ్చిన వెంటనే తగిన న్యాయం చేస్తానని చేతిలో చెయ్యేసి మరీ చెప్పారు. దీంతో మొన్నటి వరకూ ఉప్పూ, నిప్పులా మెలిగిన ఆ ఇద్దరూ కలిసి పాదయాత్రలో నడిచారు. ఇలా అనేక నియోజకవర్గాల్లో నెలకొన్న విభేదాలను పరిష్కరించడానికి వైసీపీ అధినేత సాయంత్రం సమయాన్ని ఎంచుకున్నారు. జగన్ పాదయాత్రకు మంచి స్పందన వస్తుండటం, అధికార పార్టీపై వ్యతిరేకత కనపడుతుండటంతో జగన్ చెప్పినట్లే నడుచుకోవాలని ప్రస్తుతానికి నెల్లూరు నేతలు నిర్ణయించుకున్నారు. మరి ఎన్నికల సమయానికి వారి రూటు ఎలా ఉన్నా ప్రస్తుతానికి మాత్రం పాదయాత్రలో కలిసి అడుగు వేయడం మంచి పరిణామంగా ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.
- Tags
- జగన్ పాదయాత్ర

