జగన్ ముగ్గులోకి లాగుతున్నారా....?

వైసీపీ అధినేత జగన్ స్వరం పెంచారు. ప్రత్యేక హోదా డిమాండ్ కు ప్రజల్లో మంచి స్పందన వస్తుండటంతో దాన్ని వదలకుండా తన ముగ్గులోకి ఇతర పార్టీలను లాగేందుకు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏపీ ప్రజల ప్రత్యేక డిమాండ్ ప్రత్యేక హోదానే. అయితే దానిపై తర్వాత అధికారంలోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వం నీళ్లు చల్లింది. మోడీ, చంద్రబాబు సయితం ఎన్నికల సమయంలో ప్రత్యేక హోదా ఐదేళ్లు ఇస్తే ఏం సరిపోతుందని ప్రశ్నించారు. పదిహేనేళ్లు కావాలన్నారు. అలాంటి ఇద్దరూ ప్రత్యేక హోదాను పక్కనపెట్టి ప్రత్యేక ప్యాకేజీ అంటూ కొత్త పదం వెతికి దాన్ని ముందుకు తెచ్చారు.
గొంతు కలుపుతూ.....
దీంతో నాలుగేళ్లుగా ఏపీలో ప్రత్యేక హోదా ఉద్యమం కోసం వైసీపీ అనేక పోరాటాలు చేస్తున్నా ప్రయోజనం కన్పించలేదు. అయితే ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో జగన్ మళ్లీ ఆ నినాదాన్ని అందుకున్నారు. రాజీనామాల అస్త్రాన్ని ఉపయోగించారు. ఏప్రిల్ 6వ తేదీని కేంద్రానికి డెడ్ లైన్ పెట్టారు. ఈ హోదా నినాదం ప్రజల్లోకి బలంగా వెళ్లడంతో ఇప్పుడు అధికార పార్టీ కూడా ఇరుకున పడింది. మరోవైపు జనసేన ఏర్పాటు చేసిన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ కూడా ప్రత్యేక హోదాతోనే అభివృద్ధి సాధ్యమని తేల్చింది. హోదా కోసం కార్యాచరణ ప్రకటిస్తామని పవన్ కల్యాణ్ చెప్పారు.
మిగిలిన పక్షాలదీ అదే దారి.....
ఇలా అన్ని పార్టీలనూ హోదా పేరుతో తన పరిధిలోకి లాగాలని జగన్ చేస్తున్న ప్రయత్నం ఫలిస్తుందో? లేదో? కాని అన్ని పార్టీలూ ఆలోచనలో మాత్రం పడ్డాయి. ఆదివారం జరిగిన వామపక్షాల ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలోనూ అన్ని పక్షాలూ హోదాకోసం పోరాడాలని నిర్ణయించాయి. హోదా కోసం కార్యాచరణను కూడా త్వరలో ప్రకటించనున్నట్లు వామపక్షాలు తెలిపాయి. మార్చి 5వ తేదీ లోపు డిమాండ్లను సాధించుకోలేకపోతే ఇక ఏపీకి ఏవీ దక్కదని రౌండ్ టేబుల్ సమావేశం కూడా అభిప్రాయపడింది. మొత్తం మీద జగన్ తన హోదా నినాదంతో మిగిలిన పక్షాలకు కూడా నిద్రపట్టనివ్వకుండా చేశారు.
నేటి పాదయాత్ర ఇలా.....
జగన్ పాదయాత్ర 92వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్ కందుకూరు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈరోజు ఉదయం 8గంటలకు జగన్ పాదయాత్ర ప్రారంభం కానుంది. కందుకూరు నుంచి వెంకటాద్రిపాలెం, అనంత సాగరం క్రాస్ రోడ్స్, యెద్లూరుపాడు వరకూ సాగుతుంది. యెద్లూరుపాడు వద్ద జగన్ పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. యెద్లూరు పాడు కాలనీ వద్ద భోజన విరామానికి ఆగుతారు. అక్కడి నుంచి పెద్ద వెంకన్నపాలెం, విప్పగుంట మీదుగా జగన్ యాత్ర సాగుతుంది. విప్పగుంటలో జగన్ రాత్రికి బస చేయనున్నారు.
- Tags
- జగన్

