జగన్ పై కాంగ్రెస్ వేసిన అస్త్రాన్నే?

తమ మాట వినని వారిని నిత్యం తమను ఇబ్బంది పెట్టేవారిని దారికి తెచ్చుకోవడానికి కేంద్రం ప్రయోగించే అస్త్రాలు సిబిఐ, ఈడీ. ఈ అస్త్రాలను కాంగ్రెస్ తరహాలోనే బాగా ప్రయోగిస్తోంది మోడీ సర్కార్. ఒకింత వారికన్నా పదునుగా వాడేస్తుంది. అలా చేస్తూ ప్రత్యర్థులకు వణుకు పుట్టిస్తుంది. రాబోయేది ఎన్నికల తరుణం కావడంతో ప్రత్యర్థులకు హడల్ పుట్టించేందుకు అవసరమైన అన్ని కసరత్తులు మొదలు పెట్టింది కమలం.
వైఎస్ జగన్ పై అంతే ...
తమ మాట కాదనడం అధిష్టానాన్ని ఎదిరించడాన్ని కాంగ్రెస్ సహించలేకపోయింది. దాంతో వైసిపి అధినేతపై లెక్కకు మిక్కిలిగా సిబిఐ , ఎన్ ఫోర్స్ మెంట్ బృందాలతో కేసులు పెట్టించింది. 16 నెలలపాటు బెయిల్ రాకుండా చుక్కలు చూపించింది కాంగ్రెస్. వీటిని ధైర్యంగానే న్యాయస్థానాల్లో జగన్ ఎదుర్కొంటున్నారు. వాస్తవానికి ప్రతి రాజకీయ పార్టీలో కానీ, నేతల్లో కానీ ఎక్కడో అక్కడ తప్పులు దొర్లుతాయి. వీటిని పట్టుకుని శిక్షించాలిసిన ప్రభుత్వాలు తమవాడైతే ఒకలా పరాయివాడైతే మరొకలా చట్టాలను చుట్టలుగా వాడేస్తుంటాయి. జగన్ అంశంలోనూ అదే జరిగిందనేది బహిరంగ రహస్యమే.
ఇప్పుడు కార్తిపై సేమ్ కేసులు ...
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చెన్నైలో అరెస్ట్ అయిన కార్తీ చిదంబరానిది జగన్ కేసులాంటిదే. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని కార్తీ క్విడ్ ప్రోకోకు పాల్పడ్డరన్న ఆరోపణలపై కేసులను గత ఏడాదే దర్యాప్తు సంస్థలు నమోదు చేశాయి. కార్తిపై వేసిన చార్జిషీట్ జగన్ పై నమోదు చేసిన ఛార్జ్ షీట్ దాదాపు ఒకే విధంగా వున్నాయి. ఇప్పుడు ఈ కేసు ఉచ్చులోకి కార్తీ తండ్రి మాజీ కేంద్ర ఆర్ధికమంత్రి చిదంబరాన్ని సైతం లాగి అరెస్ట్ చేయాలన్నదే మోడీ సర్కార్ ఆలోచనగా నడుస్తుంది. తద్వారా నీరవ్ మోడీ వంటి వారిపై పార్లమెంట్లో కాంగ్రెస్ ఇరుకున పడే పరిస్థితి తీసుకురావాలన్నదే అసలు వ్యవహారం.
మోడీకి వణుకుతున్న దక్షిణాది నేతలు ...
తనకు ఎదురు తిరిగే వారికి ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో కార్తీ కేసుతో నిరూపించారు మోడీ. ఆయన తీసుకోబోయే చర్యలను పసిగట్టే దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యమైన నేతలంతా మోడీకి సలాం పెడుతున్నారని పొలిటికల్ టాక్. దాంతో ఏ ఒక్కరు గట్టిగా మోడీ అండ్ టీం ను నిలదీయలేకపోతున్నారు అని అంటున్నారు. కానీ బిజెపి మాత్రం చట్టం తనపని తాను చేసుకుపోతుందని పంచ్ డైలాగ్ వినిపిస్తోంది.

