జగన్ పాదయాత్రలో....టీడీపీ ప్లాన్...?

మరో నాలుగు రోజుల్లో వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర ప్రారంభం కాబోతోంది. ఇడుపుల పాయ నుంచి ఈ నెల 6వ తేదీన ప్రారంభమయ్యే ఈ పాదయాత్ర గురించి తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో పెద్దయెత్తున చర్చ జరిగింది. అయితే జగన్ పాదయాత్రకు అడుగడుగునా నిరసనలు తెలియజేయాలని కొందరు మంత్రులు సూచించారు. జగన్ పై అవినీతి ఆరోపణలు, ఏపీ రాజధానికి జగన్ తరలి రాకపోవడం వంటి అంశాలను పాదయాత్ర సమయంలో ప్రజల నుంచే ప్రశ్నలు వేసేలా చేసి జగన్ ను ఇరకాటంలో పెట్టాలని టీడీపీ భావిస్తోంది. తొలుత ఈ కార్యక్రమాన్ని మైదుకూరు నుంచే ప్రారంభించాలని భావిస్తున్నారు.
రోజూ ఇంటలిజెన్స్ నివేదికలు.....
దాదాపు మూడు వేల కిలోమీటర్ల మేర జరుగుతున్న యాత్రకు ప్రతి శుక్రవారం బ్రేక్ పడుతున్న సమయంలో శనివారం జరిగే పాదయాత్రలో కోర్టు అంశాలనే ప్రజలచేత ప్రశ్నించాలని టీడీపీ నిర్ణయించుకున్నట్లు తెలిసింది. దీనివల్ల మానసికంగా జగన్ ను దెబ్బ కొట్టవచ్చన్నది టీడీపీ ప్లాన్ గా తెలుస్తోంది. అయితే ఆ గ్రామంలో టీడీపీకి చెందిన వ్యక్తులు కాకుండా తటస్థుల చేతనే జగన్ పై ప్రశ్నలు సంధిస్తే మీడియా నుంచి కూడా మంచి ఫోకస్ లభిస్తుందని టీడీపీ నేతలు కొందరు అభిప్రాయపడ్డారు. అయితే కొందరు మాత్రం అనవసరంగా రచ్చ అవుతుందేమోనని, ప్రశ్నిస్తే వైసీపీ కార్యకర్తలు తిరగబడి దాడిచేస్తే ఏం చేయాలని కూడా ప్రశ్నించారు. అదికూడా మంచిదే కదా? ఆ గ్రామంలో అలాంటి సంఘటన ఒకటి జరిగితే రాష్ట్రం మొత్తం పాకిపోయి జగన్ కు నెగిటివ్ అవుతుందని మరికొందరు అభిప్రాయపడ్డారు. జగన్ పాదయాత్ర సందర్భంగా ప్రతిరోజూ ఇంటలిజెన్స్ నివేదికలను ముఖ్యమంత్రి చంద్రబాబు తెప్పించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఏ రోజుకారోజు ప్రజాస్పందన.. జగన్ వ్యాఖ్యలను తనకు అందజేయాలని చంద్రాబాబు అధికారులకు ఆర్డర్ వేశారు. మొత్తం మీద జగన్ పాదయాత్ర టీడీపీలో కొంత కంగారు పెట్టిస్తుందనే చెప్పాలి.
- Tags
- జగన్ పాదయాత్ర

