జగన్, పవన్ లది ఒకటే మాట...ఒకటే బాట

టీడీపీ అధినేత చంద్రబాబు చాలా రోజుల తర్వాత అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. విశాఖలో పార్టనర్ షిప్ సమ్మిట్ ముగిసిన వెంటనే అఖిల సంఘాల సమావేశాన్ని నిర్వహిస్తానని ప్రకటించారు. అయితే అది పూర్తయి నెల రోజులు గడుస్తున్నా సమావేశం ఏర్పాటు చేయకపోవడంపై విమర్శలు తలెత్తడంతో ఈరోజు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ మేరకు అన్ని రాజకీయ పార్టీలకూ, హోదా సాధన సమితికి ఆహ్వానం పంపారు.
సమావేశానికి వైసీపీ దూరం....
అయితే దీనికి వైసీపీ దూరంగా ఉండాలని నిర్ణయించింది. చంద్రబాబు మరో కుట్రకు తెరలేపుతున్నారని, అందులో తాము భాగస్వామ్యులం కాదల్చుకోలేదని వైసీపీ స్పష్టం చేసింది. ప్రత్యేక హోదాను నాలుగేళ్లు కోల్డ్ స్టోరేజీలో పెట్టి, ఎన్నికల సమయం వచ్చేసరికి దాన్ని బయటకు తీసి నాటకాలాడుతున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు జగన్ నిర్ణయం తీసుకున్నారు. ప్రతి గంటకూ మాటమార్చే చంద్రబాబు నాయకత్వంలో తాము పనిచేసేందుకు సిద్ధంగా లేమని వైసీపీ ప్రకటించింది. 2016లోనేే చంద్రబాబు ఈ పనిచేసిి ఉంటే ఈపాటికి హోదా వచ్చి ఉండేదని వైసీపీ అభిప్రాయపడుతోంది.
పవన్ కూడా అంతే.....
ఇక జనసేన కూడా అఖిలపక్ష సమావేశానికి వెళ్లకూడదని నిర్ణయించింది. పార్లమెంటు సమావేశాలు ముగుస్తున్న సమయంలో హడావిడిగా అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ఏం ప్రయోజనమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. రాత్రి 10గంటలకు ఆహ్వానం పంపి, ఉదయం 11గంటలకు సమావేశానికి ఆహ్వానించడమేంటని కూడా జనసేనాని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు అఖిలపక్ష సమావేశంలో చర్చించే దేముంటుందని, ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేసుకుంటే సరిపోతుందని జనసేనాని నిర్ణయించారు. దీంతో అఖలపక్ష సమావేశానికి వామపక్షాలు, హోదా సాధన సమితి సభ్యులే హాజరయ్యే అవకాశముంది.
