జగన్, పవన్ పర్యటనలను పోలిస్తే...?

ప్రజా సంకల్ప యాత్ర పేరిట వైసిపి అధినేత జగన్ రెండున్నర నెలలుగా చేస్తున్న పాదయాత్రను, అనంతపురంలో జనసేన అధినేత చేపట్టిన కరువు యాత్రను ఇప్పడు జనం బేరీజు వేస్తున్నారు. జగన్ ది ప్రజాకర్షణ అయితే పవన్ ది సినీ గ్లామర్. జగన్ యాత్రకు వేలాదిగా జనం స్వచ్ఛందంగా తరలివస్తున్నారు. ఒక సినీ హీరో ఫాలోయింగ్ వైసిపి అధినేత పొలిటికల్ స్టార్ గానే సొంతం చేసుకున్నారు. ఇక పవన్ కి అభిమానుల తాకిడి తో పాటు టిడిపి క్యాడర్ జత కలిశాయి. దాంతో ఆయన కార్యక్రమాలకు భారీగానే జనం కనిపిస్తున్నారు ఎక్కువమంది పవన్ ను చూసేందుకు సెల్ఫీలు దిగేందుకు ఎగబడుతున్నారు. జగన్ పాదయాత్ర చేస్తూ జనంలోనే వుంటూ వారితో నిత్యం మమేకం అవుతున్నారు. పవన్ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేశా అని చెప్పినా పార్ట్ టైం మాత్రమే జనంలో వుంటున్నారు. ఆయన సభలు, సమావేశాలు, చర్చ గోష్ఠి , టిడిపి నేతలను, మంత్రులను, ఎమ్యెల్యేలను కలుస్తూ వెళుతున్నారు.
మీడియా కవరేజ్ లో ముందున్న పవన్ .....
సినీనటుడు కావడంతో బాటు అధికారపార్టీతో సాన్నిహిత్యం కారణంగా పవర్ స్టార్ కి వస్తున్న ప్రచారం వైసిపి అధినేత కు సంప్రదాయ మీడియా లో దక్కడం లేదు. జగన్ సొంత మీడియా, సోషల్ మీడియా లో మాత్రం వైసిపి ప్రచారం హోరెత్తిపోతున్నాయి. ఇక అధికార పార్టీ మీడియా లో జగన్ పాదయాత్ర కవరేజ్ కి సింగల్ కాలం కేటాయిస్తే పవన్ కార్యక్రమాలకు మాత్రం త్రి కాలం ఐటమ్స్ ప్రచురిస్తున్నారు. పాదయాత్రలో ప్రజలు జగన్ వద్ద చెప్పుకునే సమస్యలు, వినతిపత్రాలను సంబంధిత విభాగాలకు వైసిపి పంపుతుంటే, పవన్ నేరుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధినేతలతో సమావేశమై వాటిని పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నారు. ఇలా విభిన్న రీతిలో సాగుతున్న వీరి యాత్రలపై మాత్రం రాష్ట్రవ్యాప్తంగా విస్తృత చర్చే నడుస్తుంది. మరికొద్ది నెలల్లో జనసేన పై మరింత క్లారిటీ వచ్చేస్తుందని ప్రజలు భావిస్తున్నారు. ఇప్పటికే టిడిపి తో జనసేన దోస్తీ ని పవన్ పార్టీ శ్రేణులు అర్ధం చేసుకుని సర్దుకుపోయే పనిలో పడ్డాయి. మరోవైపు వైసిపి అధినేత మాత్రం తన మారథాన్ పాదయాత్ర చేసుకుంటూ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు.
- Tags
- జగన్
- పవన్ కల్యాణ్

