జగన్ పవన్ ని ఇరుకున పెట్టారా ..?

ఏపీ రాజకీయాలు వాడిగా వేడిగా నడుస్తున్నాయి. అధికార విపక్షాల నడుమ మాటల యుద్ధం రోజు రోజుకు తీవ్రం అవుతుంది. బిజెపి కూడా ఎక్కడా తగ్గడం లేదు. వీరందరి మధ్యలోకి వచ్చిన జనసేన తనదైన వ్యూహం తో అన్ని పార్టీలను ఇరుకున పెట్టేలా కార్యాచరణ మొదలు పెట్టింది. ఇక వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీలు సైతం తామేమీ తక్కువ తినలేదని, ఎవరి రాజకీయ వ్యూహాలతో వారు ప్రజల్లో మైలేజ్ కోసం శ్రమిస్తున్నాయి. ఏపీకి నిధులు, ప్రత్యేక హోదా, విభజన హామీల పైనే ఇటు రాష్ట్రంలోనూ, కేంద్రంలోను యుద్హాన్ని అన్ని పక్షాలు మొదలు పెట్టాయి. అందరి టార్గెట్ 2019 ఎన్నికలు. ఆ ఎన్నికల్లో వీలైనన్ని స్థానాలు దక్కించుకోవాలంటే ప్రజల దృష్టిలో హీరోలుగా గుర్తింపు పొందాలి. దానికోసం ఏడాది ముందుగానే కత్తులు నూరేస్తున్నారు అంతా. ఇందులో ఏపీలో అధికారపక్ష టిడిపి, విపక్ష వైసిపి పార్టీలు ముందు వరసలో వున్నాయి. కేంద్రంపై యుద్ధానికి సై అంటే సై అనేశాయి.
జనసేనకు చెక్ పెడుతున్న జగన్ ...
పవన్ కళ్యాణ్ జనసేన ఇప్పటికి టిడిపి మిత్రపక్షం గానే వుందన్నది ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని వైసిపి భావిస్తుంది. ఈ మేరకు వాళ్ళచేత వీళ్ళచేత విమర్శలు ఆరోపణలు చేయకుండా తానే నేరుగా ఎటాక్ ఇవ్వాలన్నది జగన్ వ్యూహం. అందులో భాగంగా గత కొద్దిరోజులుగా పాదయాత్రలో జగన్ పవన్ పార్టీపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అవిశ్వాసానికి తమ పార్టీ ఎంపీలు ఐదుగురు సిద్ధమని టిడిపి ని పవన్ కళ్యాణ్ ఒప్పించాలని జగన్ చేసిన సవాల్ తీవ్ర చర్చకు దారితీసింది. దీనికి పవన్ కళ్యాణ్ కానీ టిడిపి కానీ వెనుకడుగువేస్తే రాజకీయంగా మైనస్ లో పడతారు. అలా కాకుండా టిడిపి అవిశ్వాసానికి సిద్ధమైతే మోడీ తో తక్షణమే ఎదురయ్యే ఇబ్బందులను ఎదుర్కొవాలిసి వచ్చేది చంద్రబాబే అన్నది వైసిపి ఆలోచనగా వుంది. మరోపక్క జగన్ ప్రతిపాదనను పవన్ అంగీకరించక తప్పని పరిస్థితి వుంది. కేంద్రంపై అవిశ్వాసం పెట్టి ఇరుకున పెట్టాలని ఏపీ ఎంపీలందరిని పార్టీలకు అతీతంగా కోరింది జనసేన. ఒకవేళ టిడిపి దీనికి ముందుకు రాకపోతే పవన్ పార్టీ టిడిపికి మరింత దూరం జరగక తప్పని పరిస్థితి. రాజకీయంగా ఈ అడ్వాంటేజ్ వదులుకునేందుకు వైసిపి సిద్ధంగా లేదు అందుకే ఆ పార్టీ అధినేత అటు టిడిపి ఇటు జనసేన లను అవిశ్వాసం అస్త్రంతోనే ఎదుర్కొనేందుకు డిసైడ్ అయ్యారు అని విశ్లేషకుల అంచనా. మరి దీనికి టిడిపి, జనసేన ఎలా స్పందిస్తారు ? బిజెపి ప్రతివ్యూహం ఎలా వుండబోతుందన్నది ఆసక్తికరం.

