జగన్ నెత్తిన పాలుపోసిన ఏపీ మంత్రి?

బిజెపితో వైసిపి జట్టు కడుతుందన్న ప్రచారం టిడిపి పెద్దఎత్తునే ఇటీవల చేస్తూ వస్తుంది. బిజెపితో పొత్తు తెంపుకుంటే మొదట సంబరపడేది వైసిపి మాత్రమే అన్నది టిడిపి ఆరోపణ. కేసుల లాలూచీ కోసమే జగన్ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారంటూ టీడీపీ మీడియా చేస్తున్న ప్రచారం కూడా వైసిపికి తలబొప్పికట్టేలా సాగుతుంది. ఏపీకి బిజెపి తీవ్ర అన్యాయం చేసిందని ప్రజల మనస్సులో బాగా చొచ్చుకు పోయిన నేపథ్యంలో టిడిపి బిజెపి లపై జనం ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. టిడిపి మైండ్ గేమ్ తో వైసిపికి కూడా ఆ పాపం అంటుకుంటోంది. ఈ కీలకమైన తరుణంలో బిజెపితో వైసిపి దూరం అని నిర్ధారించే సరైన వ్యక్తి కోసం ఆ పార్టీ వేచి చూస్తుంది. ఆ సమయం రానే వచ్చింది. కాగల కార్యం గంధర్వులే నెరవేర్చినట్లు బిజెపి మంత్రి కామినేని వైసిపి నెత్తిన తనకు తెలియకుండానే పాలు పోసేశారు.
పేరుకు బిజెపికి ప్రాతినిధ్యం వహిస్తున్నా ...
పేరుకు బిజెపి అయినా మంత్రి కామినేని శ్రీనివాస్ టిడిపి సిఫార్సు తో టికెట్ తెచ్చుకుని కేబినెట్ దక్కించుకున్నారనే టాక్ ఎప్పుడు వినిపిస్తూ ఉంటుంది. ఏపీలో టిడిపి పై ఒక రేంజ్ లో పార్టీ ముఖ్య నేతలంతా ఫైర్ అవుతుంటే మంత్రి కామినేని మాత్రం ఆచి తూచే స్పందిస్తూ వస్తున్నారు. తాజాగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు వైసిపి కి తెలియకుండా మేలు చేసే విధంగా ఉన్నాయని సోషల్ మీడియా లో సెటైర్లు మొదలయ్యాయి. టిడిపి సర్కార్ ను పల్లెత్తు మాట అనకుండా సొంత పార్టీ మంత్రి మాణిక్యాలరావు తనకు పదవి వెంట్రుకతో సమానం అనడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు కామినేని. అక్కడితో ఆగకుండా టిడిపి కట్ అయితే వైసిపి తో జట్టు కడతారన్న ప్రచారం పై స్పందిస్తూ అనేక కేసుల్లో నిందితుడైన జగన్ పార్టీ తో కలిసి వెళ్ళేది లేదని స్పష్టం చేశారు. నరేంద్ర మోడీ వంటి నీతివంతులున్న పార్టీ వైసిపి వంటి పార్టీ తో జత కడితే దేశవ్యాప్తంగా తమ పార్టీకి చెడ్డ పేరు వచ్చేస్తుందన్నారు. టిడిపి, బిజెపి కలిసే వుంటాయని కూడా స్పష్టం చేయడంతో, పోరాటం చేస్తున్నాం అంటున్న బాబు సర్కార్ కి మంత్రి కామినేని వ్యవహారం మేలు కన్నా కీడే చేస్తుంది. ఈ వ్యాఖ్యలు పరోక్షంగా తమ పార్టీకి కలిసొచ్చాయని జగన్ పార్టీ సంబరపడుతుంది.

