జగన్ ను సైదాపురం...రా....రమ్మంటుందా....?

నేడు వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లకు చేరనుంది. నెల్లూరు జిల్లాలోని సైదాపురం గ్రామానికి చేరుకుంటే జగన్ వెయ్యి కిలోమీటర్లు పాదయాత్ర చేసినట్లవుతుంది. ఇందుకోసం సైదాపురంలో వైసీపీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. వైఎస్ జగన్ నవంబరు 6వ తేదీన ప్రజాసంకల్ప పాదయాత్రను కడప జిల్లా ఇడుపుల పాయలో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నాలుగు రాయలసీమ జిల్లాలైన కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో యాత్రను జగన్ పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో పర్యటన చేస్తున్నారు.
సైదాపురంలో భారీ ఏర్పాట్లు....
ప్రతి వంద కిలోమీటర్లు పూర్తి చేసిన జగన్ ఒక మొక్కను నాటుతూ వస్తున్నారు. అయితే ఈసారి వెయ్యి కిలోమీటర్లు కావడంతో వైసీపీ నేతలు, కార్యకర్తలు ఇందుకోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. నెల్లూరు జిల్లా సైదాపురం గ్రామంలో వెయ్యి కిలోమీటర్లకు గుర్తుగా 25 అడుగుల స్థూపాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సైదాపురం గ్రామాన్ని అందంగా అలంకరించారు. రంగు, రంగుల ముగ్గులు వేశారు. గ్రామమంతటా పండగ వాతావరణం కన్పించేలా తీర్చిదిద్దారు.
అన్నిచోట్ల పాదయాత్రలు....
యితే జగన్ పాదయాత్ర పూర్తి చేస్తున్న సందర్భంగా ఈరోజు ఏపీ, తెలంగాణ, విదేశాల్లో సయితం వైసీపీ అభిమానులు, కార్యకర్తలు వాక్ విత్ జగన్ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఏపీలోని మొత్తం 175 నియోజకవర్గాల్లోనూ. అన్ని మండల కేంద్రాల్లోనూ వైసీపీ నేతలు, కార్యకర్తలు జగన్ యాత్రకు సంఘీభావంగా పాదయాత్ర చేయనున్నారు. మొత్తం 750 చోట్ల ఈ పాదయాత్రలు ఉంటాయని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇక మలేసియా, సింగపూర్, అమెరికా, షార్జా, కతార్, దుబాయ్, ఆస్ట్రేలియా దేశాల్లో కూడా ఇప్పటికే జగన్ కు సంఘీభావంగా రెండు కిలోమీటర్లు నడిచి వైసీపీపై తమ అభిమానాన్ని చాటు కున్నారు. నేడు వెయ్యి కిలోమీటర్ల పూర్తయిన సందర్భంగా జగన్ ప్రసంగించేందుకు భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేశారు.
- Tags
- జగన్ పాదయాత్ర

