జగన్ నిర్ణయం టీడీపీకి ఇబ్బందేనా?

మరోసారి చంద్రబాబును బరిలోకి లాగేందుకు వైసీపీ అధినేత జగన్ ప్రయత్నిస్తున్నారు. పార్లమెంటు నిరవధిక వాయిదా పడిన వెంటనే పార్టీ ఎంపీలు రాజీనామాలు చేయాలని జగన్ నిర్ణయించారు. గుంటూరు జిల్లా చాగంటి వారి పాలెంలో జరిగిన పార్లమెంటు సభ్యులతో జరిగిన సమావేశంలో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటు సమావేశాలు మంగళ, బుధవారాలు జరిపి వాయిదా వేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
హోదా విషయంలో...
జగన్ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం తొలుత పెట్టి టీడీపీని ఇరుకున పెట్టారు. జగన్ అవిశ్వాసం పెడుతుండటంతో టీడీపీకి ఇక ఆలోచించే సమయం కూడా లేకుండా వెంటనే ఎన్డీఏకు గుడ్ బై చెప్పాల్సి వచ్చింది. తాము కూడా అవిశ్వాసం పెట్టేందుకు ముందుకు రావాల్సి వచ్చింది. ప్రత్యేక హోదా విషయంలోనూ అదే జరిగింది. మంత్రులు కేంద్ర ప్రభుత్వం నుంచి వైదొలగడం కూడా అంతే. టీడీపీని ఇరుకుపెట్టేలా జగన్ నిర్ణయాలు ఉండటం, ప్రత్యేక హోదా విషయంలో జగన్ ఒక అడుగు ముందులో ఉండటం టీడీపీ నేతలకు మింగుడు పడటం లేదు.
టీడీపీకి ఇరకాటమేనా?
ఈ నేపథ్యంలో జగన్ తాజాగా తీసుకున్న నిర్ణయం కూడా టీడీపీని ఇరుకున పెడుతుందని చెబుతున్నారు. జగన్ పార్టీకి చెందిన సభ్యులు పార్లమెంటు నిరవధిక వాయిదా పడిన రోజునే తాము రాజీనామాలు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. గతంలో ఏప్రిల్ 6వ తేదీన రాజీనామాలు చేద్దామనుకున్నారు. కాని ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చుకుంటూ వెళుతున్న జగన్ శిబిరం వాయిదా పడిన వెంటనే రాజీనామాలు చేసి వచ్చేయాలని నిర్ణయించారు. దీంతో టీడీపీ ఎంపీలు కూడా రాజీనామాలు చేయాల్సిన పరిస్థితిని జగన్ కల్పించనున్నారు.
బీజేపీతో పొత్తు ప్రసక్తి లేదు.....
తాము బీజేపీతో అంటకాగలేదని, లోపాయికారి ఒప్పందాలను కూడా కుదుర్చుకోలేదని వైసీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి జగన్ తో సమావేశం ముగిసిన తర్వాత వ్యాఖ్యానించారు. జగన్ లైన్లోకి చంద్రబాబు రావాల్సిందేనని ఆయన అన్నారు. బీజేపీతో ఎట్టిపరిస్థితుల్లో కలిసేది లేదని చెప్పారు. నాలుగేళ్లుగా బీజేపీ, టీడీపీలు కలసి ప్రజలను మోసం చేశాయన్నారు. మొత్తం మీద జగన్ ఎంపీలతో జరిపిన సమావేశంలో రాజీనామాలపైనే ఎక్కువ సేపు చర్చించినట్లు తెలిసింది.
