జగన్ చెప్పిందేమిటి? జరుగుతున్నదేంటి?

వైసీపీ అధినేత జగన్ చెప్పినట్లు క్షేత్రస్థాయిలో జరగడం లేదు. ఒక పక్క పార్టీ అధినేత ఎండనకా...వాననకా రోజుకు పదిహేను కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ కష్టపడుతుంటే... నియోజకవర్గాల్లో నేతలు మాత్రం తడిగుడ్డ వేసుకుని పడుకున్నారన్న విమర్శలు విన్పిస్తున్నాయి. పాదయాత్రలో ఉండగానే ఒక క్యాలెండర్ ను జగన్ విడుదల చేశారు. పాదయాత్ర లో తాను ఏ జిల్లాలో ఉన్నప్పటికీ అన్ని నియోజకవర్గాల్లో రచ్చబండ, పల్లెనిద్ర వంటి కార్యక్రమాలను కొందరు చేయడం లేదు. దీనిపై జగన్ సీరియస్ గా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. అనంతపురం పుట్టపర్తి నియోజకవర్గంలో పర్యటిస్తున్న జగన్ జిల్లాల వారీగా నివేదికలను తెప్పించుకుని చూశారు. చాలా నియోజకవర్గాల్లో కార్యక్రమాలు జరగడం లేదు. ముఖ్యంగా పశ్చిమ గోదావరిజిల్లాలో పార్టీ కార్యక్రమాలను నేతలెవ్వరూ పట్టించుకోవడం లేదని సమాచారం రావడంతో ఆ నేతలతో జగన్ నేరుగా మాట్లాడినట్లు తెలిసింది.
ఆ నాలుగు జిల్లాల్లో....
గత ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో జగన్ పార్టీ బోణీ కూడా కొట్టలేదు. ఒక్క ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు. ఇక్కడ టీడీపీ క్లీన్ స్వీప్ చేసేసింది. అయితే ప్రభుత్వ నిర్ణయాలతో ఇప్పుడిప్పుడే ఆ జిల్లాలోని ప్రజల్లో వ్యతిరేకత ఎదురవుతోంది. దానిని క్యాష్ చేసుకునేందుకు వైసీపీ నేతలు ముందుకు రావడం లేదు. అలాగే ప్రకాశం జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొని ఉంది. అక్కడ తన కుటుంబ సభ్యులైన బాలినేని శ్రీనివాసులు రెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలు ఉన్నప్పటికీ పార్టీకార్యక్రమాలు చురుగ్గా నిర్వహించడం లేదన్న విషయం జగన్ దృష్టికి వచ్చింది. ప్రశాంత్ కిషోర్ టీం ఇచ్చిన నివేదిక మేరకు అధ్యయనం చేసిన జగన్ పశ్చిమగోదావరి, విజయనగరం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల నేతలకు జగన్ ఫోన్ లోనే క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. ఇలాగైతే వచ్చే ఎన్నికల్లో ఎలా గెలుస్తామని ప్రశ్నించినట్లు తెలిసింది. కార్యక్రమాలు చేపట్టడానికి మీకెదురవుతున్న ఇబ్బందులేమిటో చెప్పాలని కూడా జగన్ కొంత కఠినంగానే ప్రశ్నించడంతో వారు నీళ్లు నమిలారు. మొత్తం మీద పాదయాత్రకు ముందు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి మరీ జగన్ కార్యక్రమాలను రూపొందిస్తే వాటిని అమలు చేయడానికి మాత్రం నేతలు ముందుకు రావడం లేదు. దీంతో జగన్ త్వరలోనే సీనియర్ నేతల సమావేశాన్ని ఏర్పాటుచేయాలని ఆదేశించినట్లు సమాచారం. మొత్తం మీద జగన్ చెప్పినట్లు క్షేత్రస్థాయిలో జరగడం లేదన్నది మాత్రం తెలియడంతో జగన్ ఒకింత అసహనం వ్యక్తం చేశారట.
- Tags
- జగన్

