జగన్ కేసు మోడీకి చుట్టుకుందే...!

వైసీపీ అధినేత జగన్ కేసు ఇప్పుడు కేంద్రానికి చుట్టుకుంది. అంతర్జాతీయ న్యాయస్థానానికి ఈ కేసు చేరింది. దీంతో ప్రధాని మోడీతో పాటు పలువురు మంత్రులకు మారిషస్ ప్రభుత్వం నోటీసులు పంపింది. ఇందూటెక్ జోన్ ఐటీ సెజ్ కేసులో ఈపరిణామం సంభవించింది. ఇందూటెక్ జోన్ లో తాము పెట్టుబడులు పెట్టి నష్టపోయామని మారిషస్ ప్రభుత్వం నెదర్లాండ్స్ లోని ఆర్బిట్రేషన్ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఇందుటెక్ జోన్ లో మారిషస్ కు చెందిన కరీసా ఇన్వెస్ట్ మెంట్స్ ఎల్ఎల్ సి సంస్థ 49 శాతం వాటాలు కలిగి ఉంది.
మోడీకి నోటీసులు జారీ....
అయితే ఇందూటెక్ జోన్ కు అక్రమంగా భూ కేటాయింపు జరిగాయంటూ సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేసిన విషయం విదితమే. ఈ కేసులో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటు శ్యాంప్రసాదరెడ్డి కూడా ఉన్నారు. ఈ ఇందూటెక్ పనులు నిలిచిపోవడంతో తాము పెట్టుబడులు పెట్టి నష్టపోయామని మారిషస్ ప్రభుత్వం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీంతో ప్రధాని మోడీకి కూడా నోటీసులు జారీ అయ్యాయి. మోడీతో కేంద్ర ఆర్థిక మంత్రి, న్యాయశాఖ మంత్రి, వాణిజ్య పన్నుల శాఖా మంత్రి, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రుల పేర్లను ప్రతివాదులుగా చేర్చినట్లు సమాచారం.
రూ.115 కోట్ల నష్టమంటున్న....
ఇందుటెక్ జోన్ మారిషస్ కు చెందిన కరీసా ఇన్వెస్ట్ మెంట్స్ 115 కోట్ల రూపాయల వరకూ పెట్టుబడి పెట్టింది. అయితే సీబీఐ కేసు నమోదు కావడంతో ఈ ప్రాజెక్టు మూలన పడింది. తాము 115 కోట్లు పెట్టుబడి పెట్టి భారీగా నష్టపోయామని తమకు 50 మిలియన్ డాలర్ల నష్టపరిహారం ఇప్పించాలని మారిషస్ ప్రభుత్వం కోరుతోంది. మొత్తం మీద జగన్ కేసు అంతర్జాతీయ న్యాయస్థానానికి చేరుకుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.
- Tags
- జగన్

