జగన్ కు విశ్రాంతి అవసరమా?

వైసీపీ అధినేత జగన్ ప్రజాసంకల్ప యాత్ర 61వ రోజుకు చేరుకుంది. ఆయన గత కొద్ది రోజులుగా జలుబు, దగ్గుతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఆయన డస్ట్ ఎలర్జీ తో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా పల్లెల వెంట పాదయాత్ర సాగుతుండటం, దుమ్ము, ధూళిలో ఆయన తిరుగుతుండటంతో జలుబు తీవ్రమయింది. కళ్ల వెంట నీరు కూడా కారుతుండటంతో జగన్ ఇబ్బంది పడుతున్నట్లు వైసీపీ నేతలు చెప్పారు. అయినా జగన్ పాదయాత్రను కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం జగన్ చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.
జలుబు, దగ్గు, గొంతునొప్పితో...
జగన్ పాదయాత్ర వెంట వేల మంది ప్రజలు వస్తుండటంతో ఆయన నడిచే బాట వెంట దుమ్ము రేగుతోంది. దీంతో ఆయనకు జలుబు, గొంతునొప్పితో బాధపడుతున్నారు. ఈరోజు డస్ట్ అలెర్జీ తీవ్రం కావడంతో తనను కలిసేందుకు వచ్చిన వారితో కూడా మాట్లాడలేకపోతున్నారు. ఆయన తీవ్ర ఇబ్బంది పడుతున్నారని తెలిసి తిరుపతి నుంచి వైద్యులన రప్పించారు. ఇక రాత్రి పూట నిద్ర కూడా తక్కువయిందంటున్నారు. రాత్రి 12 గంటల వరకూ స్థానిక నేతలతో మాట్లాడి నిద్రపోతే..ఉదయం 5గంటలకే నిద్ర లేచి పాదయాత్రకు జగన్ సిద్ధమవుతున్నారు. తగిన విశ్రాంతి లేకపోవడం, దుమ్ముధూళి కారణంగా జగన్ ఇబ్బంది పడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. పొడిదగ్గుతో జగన్ తట్టుకోలేకపోతున్నారు.
అరికాళ్ల బొబ్బలతో ఇబ్బంది....
ఇక అరికాళ్ల పై బొబ్బలు లేవడంతో కూడా జగన్ ఇబ్బంది పడుతున్నారని వైద్యులు చెప్పారు. ఆయన కనీసం రెండు రోజుల పాటు విశ్రాంతి అవసరమంటున్నారు వైద్యులు. విశ్రాంతి లేకుండా ఇలాగే పాదయాత్ర చేస్తే గొంతునొప్పితో పాటు దగ్గు కూడా ఎక్కువవుతుందని వైద్యులు వైసీపీ నేతలకు చెప్పారు. ఎండతీవ్రత ఎక్కువగా ఉండటం కూడా జగన్ అస్వస్థతకు కారణమని చెబుతున్నారు. జగన్ పాదయాత్ర ప్రారంభించినప్పటికీ ఇప్పటికీ ఆరున్నర కిలోల బరువు తగ్గినట్లు వైద్యులు చెప్పారు. అయితే సంక్రాంతి పండగకు రెండు రోజులు జగన్ ను విశ్రాంతి తీసుకోవాలని వైసీపీ నేతలు కోరుతున్నారు. సంక్రాంతికి రెండురోజుల పాటు జగన్ చంద్రగిరి నియోజకవర్గంలోనే ఉండి విశ్రాంతి తీసుకోనున్నారు. వైద్యుల సూచనలను జగన్ కుటుంబ సభ్యుల దృష్టికి వైసీపీ నేతలు తీసుకెళ్లారు.
- Tags
- జగన్

