జగన్ ఇబ్బందిపడుతున్నారా?

జగన్ నడవలేకపోతున్నారా? అరికాళ్లకు బొబ్బలు లేచి జగన్ ఇబ్బంది పడుతున్నారా? అవును. జగన్ అరికాళ్లకు బొబ్బలు లేచి పాదయాత్ర చేసేందుకు జగన్ ఇబ్బంది పడుతున్నారు. నిన్న రాత్రి నుంచి జగన్ అరికాళ్లలో బొబ్బలతో బాధపడుతున్నారు. అయినా ఆయన పాదయాత్రను ఆపలేదు. కాస్త నెమ్మదిగా ముందుకు సాగుతున్నారు. జగన్ నిన్ననే మూడు వందల కిలోమీటర్ల మేరకు పాదయాత్రను పూర్తి చేశారు. జగన్ షూ వాడుతున్నప్పటికీ బొబ్బలు లేవడంతో అత్యవసరంగా వైద్యులను రప్పించారు. విషయం తెలుసుకున్న జగన్ సతీమణి భారతి పాదయాత్ర వద్దకు చేరుకున్నారు. అరికాళ్ల బొబ్బలకు వైద్యులు చికిత్స చేసినట్లు వైసీపీ వర్గాలు వెల్లడించాయి.
హుటాహుటిన చేరుకున్న భారతి....
జగన్ ప్రస్తుతం కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. కారుమంచి నుంచి యాత్ర ప్రారంభమైంది. ప్రస్తుతం జగన్ భోజన విరామసమయానికి ఆగారు. ఆయనతో సతీమణి భారతి భేటీ అయ్యారు. జగన్ తారు రోడ్డు మీద నడవడం వల్లనే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. గతంలో జగన్ కు వెన్నునొప్పి సమస్య కూడా రావడంతో వైద్యులను తిరుపతి నుంచి హుటాహుటిన రప్పించారు. ప్రస్తుతం అరికాళ్లపై బొబ్బలు లేవడంతో బాధపడుతున్న జగన్ పాదయాత్రను మాత్రం నెమ్మదిగా కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. ఆయనను పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి కలిసి పరామర్శించారు. జగన్ పాదయాత్రకు విశేష స్పందన లభిస్తుందని, అది చూసి ఓర్వలేక టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మేకపాటి ఆరోపించారు. రాజ్యసభ సీటు కోసమే వైసీపీ ఎమ్మెల్యేలకు ఎరవేసి మరీ చేర్చుకుంటున్నారని మేకపాటి అభిప్రాయపడ్డారు. నేతలు వెళ్లినా జగన్ వెంట ప్రజలు ఉన్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
- Tags
- జగన్

