జగన్ అక్కడ నెమ్మదిగా...తర్వాత వేగంగా...!

వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర ప్రస్తుతం నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో జరుగుతుంది. ఇప్పటికే వెయ్యి కిలోమీటర్లు దాటిన జగన్ పాదయాత్రకు అన్ని జిల్లాల్లో మంచి స్పందన కన్పిస్తోంది. అయితే పాదయాత్ర గ్రామాల్లో ప్రవేశించినప్పుడు మాత్రం చాలా నెమ్మదిగా సాగుతోంది. గ్రామాల్లో ప్రజలు వచ్చి జగన్ పలుకరిస్తుండటం, జగన్ తో సెల్ఫీలు దిగడానికి కొందరు పోటీ పడుతుండటంతో గ్రామానికి పాదయాత్ర చేరుకున్నప్పుడు మాత్రం నెమ్మదిగా సాగుతుంది. ఒక గ్రామం దాటడానికి జగన్ కు దాదాపు రెండు గంటలకు పైగానే పడుతుంది.
ప్రజలు వచ్చి పలుకరిస్తుండటంతో....
గ్రామాల్లో ప్రజలు వచ్చి తమ సమస్యలను చెప్పుకుంటున్నప్పుడు వినాల్సిన పరిస్థితి. వారిచ్చే వినతిపత్రాలను స్వీకరించి వాటిని పరిశీలించాల్సి ఉంటుంది. అందుకోసం జగన్ గ్రామానికి చేరుకున్నప్పుడు మాత్రం బాగా లేటవుతుందని పాదయాత్ర నిర్వాహకులు చెబుతున్నారు. ఒక్కో గ్రామం దాటాలంటే చాలా కష్టంగా ఉందంటున్నారు. గ్రామం పొలిమేరల నుంచి మాత్రం జగన్ వేగంగా నడుస్తున్నారు. అందుకే రోజుకు 12 నుంచి 14 కిలోమీటర్లు మాత్రమే జగన్ పాదయాత్ర సాగుతుందని వైసీపీ నేతలు చెబుతున్నారు.
గ్రామం దాటిన వెంటనే....
గ్రామాల్లో స్వచ్ఛందంగా ప్రజలు వస్తుండటంతో నడక కూడా నెమ్మదిగా సాగుతోంది. గ్రామం మొత్తం పొలిమేరల వరకూ వచ్చి జగన్ కు వీడ్కోలు చెబుతుండటం విశేషం. అలాగే తనను చూసేందుకు వచ్చిన వారిని జగన్ ఆప్యాయంగా పలుకరిస్తున్నారు. ఇంటి గుమ్మం వద్ద వేచి చూస్తున్న మహిళలను కూడా జగన్ ఆగి మరీ తన వద్దకు పిలిపించుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. అయితే ప్రయివేటు సెక్యూరిటీ కొంత ఓవర్ యాక్షన్ చేస్తుండటంతో జగన్ వారిపైన కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ పాదయాత్ర ఇంత నెమ్మదిగా కొనసాగడానికి అదే కారణమని వైసీపీ నేతలు చెబుతున్నారు. జగన్ ఇంకా మరో రెండు వేల కిలోమీటర్లు ఎనిమిది జిల్లాల్లో పాదయాత్ర చేయాల్సి ఉంది. అనుకున్న సమయానికి పాదయాత్ర పూర్తవుతుందా? లేదా? అన్న ఆందోళనలో వైసీపీ నేతలు ఉన్నారు.
- Tags
- జగన్

