జంపింగ్ రెడ్డికి పదవి రెడీ చేస్తోన్న కేసీఆర్....!

రాజకీయ కారణాలతో ఇతర పార్టీల నుంచి తన పార్టీలోకి చేర్చుకున్న నేతలకు పదవులు రెడీ చేస్తున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. కాంగ్రెస్, టీడీపీల నుంచి భారీ ఎత్తున నేతలు తరలి వచ్చి కేసీఆర్ పిలుపు మేరకు పార్టీలో చేరారు. అంతేకాదు, వచ్చే ఎన్నికల్లో తిరిగి టీఆర్ ఎస్‌ను అధికారంలోకి తెచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో తమకూ ఓ గుర్తింపు కావాలని, తమకూ ఓ పదవి కావాలని నేతలు కోరుకుంటున్నారు. నిజానికి పార్టీ మారే క్రమంలోనే నేతలు పదవులపై కేసీఆర్‌తో నేరుగానే చర్చించారని అప్పట్లోనే కథనాలు వచ్చాయి. అయితే, కొందరికి పదవులు ఇచ్చిన కేసీఆర్.. మరికొందరిని మాత్రం పెండింగ్ లో ఉంచారు. అయితే, ఇప్పుడు ఎన్నికల వేడి రాజుకోవడం, విపక్షాలు బలమైన ఆయుధాలతో బరిలోకి దిగే ప్రయత్నాలు ముమ్మరం చేయడంతో కేసీఆర్ తన వ్యూహాన్ని మార్చుకున్నారు.
సరైన పదవి ఇవ్వాలని....
ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిలో కీలకమైన వారికి పదవులు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలోనే నల్లగొండ కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డికి పదవి ఇస్తానని అప్పట్లోనే మాటిచ్చిన కేసీఆర్ ఆ తర్వాత ఎంపీ పదవికి గుత్తాతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్తారనే ప్రచారం సాగింది. అనంతరం, అసెంబ్లీకి పోటీ చేయించి రాష్ట్ర కేబినెట్లో సీటు కన్ఫర్మ్ చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ,, ఎందుకో అప్పట్లో గులాబీ బాస్ అడుగులు ముందుకు వేయలేదు. ఇక, ఇప్పుడు మాత్రం గుత్తాకు సరైన పదవిని ఇచ్చి సంతోష పెడతారనే వార్తలు తెలంగాణ వర్గాల్లో వినిపిస్తున్నాయి. సీనియర్ మోస్ట్ అయిన గుత్తాను సంతోషపెట్టడమే ధ్యేయంగా కేసీఆర్ పావులు కదుపుతున్నారని తెలుస్తోంది.
రైతు సమన్వయ పదవి రెడీ....
రాష్ట్రంలో రైతు సమన్వయ సమితి పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. దళారుల ఆగడాలను అడ్డుకోవడంతోపాటు, రైతులకు పూర్తిస్తాయిలో మద్దతు ధరలను అందించే సదుద్దేశంతో సీఎం కేసీఆర్ దీనిని ఏర్పాటు చేస్తున్నారు. గ్రామస్థాయి - మండల స్థాయి రైతు సమన్వయ సమితులకు తోడుగా జిల్లాస్థాయి రైతు సమన్వయ సమితుల ఏర్పాటుకు ఆయా జిల్లాల మంత్రులు తగిన చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు. జిల్లా సమన్వయ సమితుల ఏర్పాటు తర్వాత గ్రామ - మండల - జిల్లాస్థాయి సమితులతో రాష్ట్రంలో నలుదిక్కులా నాలుగు ప్రదేశాలలో సదస్సులను నిర్వహించాలని సూచించారు. ఈ రాష్ట్ర రైతుల సమన్వయ సమితి చైర్మన్‌గా గుత్తా సుఖేందర్ రెడ్డిని నియమించాలని గులాబీ బాస్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. దీంతో గుత్తాలోని అసహనం చల్లారుతుందని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
- Tags
- కేసీఆర్

