ఛాన్స్ ఉన్నా జగన్ కు అక్కడ ఓటమి ఎందుకంటే?

ఆ నియోజకవర్గం అందరికీ ఆశ్రయమిచ్చింది. స్వతంత్ర అభ్యర్థుల దగ్గర నుంచి కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థులను గెలిపించింది. కాని వైసీపీ మాత్రం ఇక్కడ బోణీ కొట్టలేదు. 2004 ఎన్నికల వరకూ ఇది జనరల్ నియోజకవర్గమే. తర్వాత ఎస్సీలకు రిజర్వ్ అయింది. అయినా ఇక్కడ వైసపీ జెండా ఎగరలేదు. టీడీపీ, కాంగ్రెస్ లకు కంచుకోటగా నిలిచిన ఆ నియోజకవర్గమే కొండపి. కొండపి నియోజకవర్గం ప్రకాశం జిల్లాలో ఉంది. ప్రస్తుతం వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర కొండపి నియోజకవర్గంలో సాగుతోంది. ఈ నియోజకవర్గంలో జగన్ పర్యటనకు మంచి స్పందనే లభిస్తుంది.
కాంగ్రెస్ కు అండగా నిలిచిన....
కొండపి నియోజకవర్గం 1955లో ఏర్పడింది. అప్పటి నుంచి 2004 వరకూ ఇది జనరల్ నియోజకవర్గంగానే ఉంది. ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎనిమిదిసార్లు ఈ నియోజకవర్గంలో విజయం సాధించింది. 13 సార్లు జరిగిన ఎన్నికల్లో ఎనిమిదిసార్లు విజయం సాధించి కాంగ్రెస్ కు కంచుకోటగా కొండపినిలిచింది. 1983లో స్వతంత్ర అభ్యర్థి మోరుబోయిన మాలకొండయ్య ఇక్కడి నుంచి గెలిచారు. తర్వాత కాంగ్రెస్ తరుపున అచ్యుత్ కుమార్, తెలుగుదేశం పార్టీ తరుపున దామచర్ల ఆంజనేయులు రెండుసార్లు గెలుపొందారు. అయితే వైసీపీ మాత్రం గత ఎన్నికల్లో ఇక్కడ ఓటమి పాలయింది. ఈ నియోజకవర్గం నుంచి జూపూడి ప్రభాకర్ రావు గత ఎన్నికల్లో వైసీపీ తరుపున పోటీ చేశారు. ఆయనపైన టీడీపీ అభ్యర్థిగా బాల వీరాంజనేయ స్వామి పోటీ చేసి ఐదు వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. తర్వాత జూపూడి టీడీపీలోకి మారి ప్రస్తుతం ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ గా పనిచేస్తున్నారు.
కాంగ్రెస్ ఓటు బ్యాంకు వైసీపీకి మారినా....
సహజంగా కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అంతా గత ఎన్నికల్లో డైవర్ట్ అయింది. దళితులు, ముస్లింలు, రెడ్డి సామాజిక వర్గం కాంగ్రెస్ ను వీడి వైసీపీ కి టర్న్ అయ్యారన్నది అందరికీ తెలిసిందే. అయితే అతి సులువుగా గెలుచుకోవాల్సిన ఈ నియోజకవర్గాన్ని వైసీపీ చేజేతులా గత ఎన్నికల్లో పోగొట్టుకుందన్న విమర్శలున్నాయి. స్థానికంగా అందుబాటులో ఉండని జూపూడి ప్రభాకర్ రావును అభ్యర్థిగా ఎంపిక చేయడమే వైసీపీ చేసిన తప్పు అని ఎన్నికల సమయంలోనే ఆ నియోజకవర్గ నేతలు జగన్ దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. అయితే ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న నియోజకవర్గాన్ని తమ పరం చేసుకోవాలని జగన్ పాదయాత్ర చేస్తున్నారు. మరి ఈసారి అభ్యర్థి ఎంపికను బట్టే విజయావకాశాలు ఉంటాయని జగన్ గ్రహించాలని స్థానిక నేతలు కోరుకుంటున్నారు.
పాదయాత్రతోనైనా....
దీంతో జగన్ కొండపి నియోజకవర్గలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. కొండపి నియోజకవర్గంలోని విప్పగుంట, లింగంగుంట, మాలెపాడు, తిమ్మపాలెంలో జగన్ పర్యటించారు. పాదయాత్రకు జనం పోటెత్తారు. చౌటపాడులో పార్టీ జెండాను ఆవిష్కరించిన జగన్ తిమ్మపాలెం వద్ద రైతు ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని వారికి భరోసా కల్పించారు. జగన్ పాదయాత్ర నేటికి 94వ రోజుకు చేరుకుంది. మహిళలు అధికసంఖ్యలో జగన్ పాదయాత్రకు రావడం విశేషం. అలాగే తన వద్దకు వచ్చిన ప్రతివారినీ ఆప్యాయంగా పలుకరిస్తూ జగన్ ముందుకు వెళుతున్నారు. జగన్ పాదయాత్రతో ఈసారి ఖచ్చితంగా కొండపి నియోజకవర్గంలో పార్టీ జెండా ఎగురుతుందని ఆ పార్టీ నేతలు ఆత్మవిశ్వాసంతో ఉన్నారు.
నేటి పాదయాత్ర షెడ్యూల్....
జగన్ 94వ రోజు పాదయాత్రలో కొండపి నియోజకవర్గం లో సాగుతుంది. పొన్నలూరు మండలంలో బస చేసిన ప్రాంతం నుంచి ఈరోజు జగన్ బయలుదేరుతారు. అక్కడ నుంచి చెరువు కొమ్ము పాలెం, కె. అగ్రహారం, పర్చూరివారిపాలెం వరకూ సాగుతుంది. అక్కడ జగన్ భోజన విరామానికి ఆగుతారు. తర్వాత వెంగళాపురం క్రాస్ రోడ్స్, పెద అలవలపాడు వరకూ జగన్ పాదయాత్ర కొనసాగుతుంది.
- Tags
- జగన్ పాదయాత్ర

