చిరు...పొలిటికల్ స్క్రీన్ పై ఇక మూడు నెలలేనా?

మెగాస్టార్ చిరంజీవికి ఇక రాజ్యసభ పదవీకాలం మూడు నెలలే ఉంది. ఆయనకు ఈసారి మరోసారి రాజ్యసభకు ఎన్నికయ్యే అవకాశం లేదు. దీంతో ఆయన రాజకీయాలకు పూర్తిగా స్వస్తి చెప్పినట్లే అనుకోవాలి. కాంగ్రెస్ పార్టీలో పేరుకే ఉన్నారు చిరంజీవి. ఆయన పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదు. గత ఏడాదిన్నర కాలంగా పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. బుల్లితెర, వెండితెర మీదనే ఆసక్తి చూపుతున్న చిరు ఇక రాజకీయాల జోలికి వచ్చే అవకాశం లేదంటున్నారు.
పవన్ కు వ్యతిరేకంగా....
తన సోదరుడు పవన్ కల్యాణ్ జనసేన పార్టీ స్థాపించి ప్రజల్లోకి వెళుతున్నారు. జనసేనను క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. పవన్ చాలా సిన్సియర్ గానే ప్రయత్నిస్తున్నారు. పవన్ కు కాంగ్రెస్ పార్టీ అంటే అస్సలు గిట్టదు. రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్ పార్టీని దరిచేరనీయవద్దని ఇప్పటికీ పవన్ ప్రజలకు పిలుపునిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో పవన్ కు వ్యతిరేకంగా చిరంజీవి కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో పాల్గొనకపోవచ్చన్నది ఆయన సన్నిహితుల నుంచి విన్పిస్తున్న మాట. పవన్ కూడా ఇటీవల ఏపీలో పర్యటించినప్పుడు అన్నయ్యను వెనుకేసుకొచ్చిన సంగతి తెలిసిందే.
రాజకీయాలకు గుడ్ బై చెబుతారా?
చిరంజీవి రాజ్యసభ సభ్యత్వం వచ్చే ఏడాది ఏప్రిల్ 2వ తేదీతో ముగుస్తుంది. రాజ్యసభ పదవిలో ఉన్నారు కాబట్టి చిరంజీవి ఇప్పటి వరకూ పవన్ కు మద్దతుగా మాట్లాడలేదంటున్నారు. రాజ్యసభ పదవీకాలం పూర్తయిన తర్వాత పవన్ కు చిరు నేరుగా మద్దతు ప్రకటించే అవకాశముందంటున్నారు. పవన్ వ్యక్తిత్వాన్ని, ఆయన సిద్ధాంతాలను చిన్నప్పటి నుంచి గమనించిన చిరు ఆ విషయాలనే ప్రజలకు చెప్పే అవకాశముందంటున్నారు. తాను మాత్రం రాజకీయాలకు దూరంగా ఉండదలచుకున్నానని ఆయన ఇప్పటికే తన సన్నిహితుల వద్ద చెప్పేశారట. అంటే రాజకీయ నేతగా చిరు ఇక మూడునెలలే పొలిటికల్ స్క్రీన్ పై కన్పిస్తారన్నమాట. తర్వాత కాంగ్రెస్ పార్టీకి కూడా ఆయన గుడ్ బై చెప్పే అవకాశముందంటున్నారు.
- Tags
- చిరంజీవి

