పోలీసులే పట్టించుకోని హోం మినిస్టర్ ఈయనే..!

హోమంత్రి చినరాజప్పకు పోలీసులే విలువ ఇవ్వడం లేదా? ఆయనను హోంమంత్రిగానే చూడటం లేదా? హోంమత్రి అంటే ఇంటివద్ద ఆయన క్యాంపు కార్యాలయం వద్ద పోలీసుల భద్రత ఎక్కువ ఉంటుంది. హోంమంత్రిని మావోయిస్టులు టార్గెట్ చేసే అవకాశాలున్నాయి. అలాంటి హోంమంత్రికి భద్రత 24 గంటలూ కల్పించాల్సిన బాధ్యత పోలీసులది. కాని ఏపీ హోంమంత్రి చిన రాజప్పను మాత్రం పోలీసు శాఖ లైట్ గానే తీసుకుంటున్నట్లుంది. ఇటీవల జరిగిన సంఘటన చూస్తే అది నిజమని చెప్పక తప్పదు. ఆయనను అసలు పోలీసు అధికారులే లెక్క చేయని పరిస్థితి. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన చిన రాజప్ప అందరినీ కలుపుకుని పోతారు. అందరిలో కలిసిపోతారు. ఎటువటి భేషజాలుండవు. తనకు సెల్యూట్ చేయకపోయినా పెద్దగా పట్టించుకోరాయన. అదే వీక్ నెస్ గా తీసుకున్నట్లుంది తూర్పుగోదావరి జిల్లా పోలీసులు.
హోమంత్రి భద్రతను గాలికొదిలేసి....
ఇటీవల వైసీపీ నేత జక్కంపూడి రాజాపై రామచంద్రాపురంలో ఎస్ఐ దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆయనపై చేయి చేసుకున్న ఎస్ఐపై కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కాని ఎస్ఐపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో వైసీపీ నేత జక్కంపూడి రాజా ఏకంగా హోంమంత్రి ఇంటి ముందే ధర్నాకు దిగారు. అర్ధరాత్రి జక్కంపూడి రాజా ధర్నాకు దిగుతారన్న కనీస సమాచారం పోలీసులకు లేదు. రాజా వచ్చి నింపాదిగా హోంమంత్రి ఇంటి ముందు ఆందోళనకు దిగిన తర్వాత గాని పోలీసులకు తెలియలేదు. దీనిపై పెద్దయెత్తున విమర్శలు విన్పిస్తున్నాయి. వైసీపీ నేత రాజా కాబట్టి సరిపోయింది... మరెవరైనా అయిఉంటే పరిస్థితి ఏంటని హోమంత్రి సన్నిహితులు ప్రశ్నిస్తున్నారు. చినరాజప్ప ఇటీవలే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట మండలంలోని శివారు గ్రామమైన అచ్చంపేటలో ఇటీవలే గృహప్రవేశం చేశారు. ఈ ప్రాంతం కొంత నిర్మానుష్యంగా ఉంటుంది. అటువంటి ప్రాంతంలో ఉన్న హోంమంత్రి ఇంటికి భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసులది కాదా? అన్న ప్రశ్నలు విన్పిస్తున్నాయి. ఇప్పటికైనా పోలీసులు హోమంత్రికి భద్రత కల్పించాలని ఆయన అనుచరులు కోరుతున్నారు.
- Tags
- చినరాజప్ప

