చినజీయర్ పెద్ద మనసు : ధార్మికబోధే కాదు దేశభక్తి కూడా

వైష్ణవ మత గురువు శ్రీమద్ రామానుజ త్రిదండి చినజీయర్ స్వామి భారత సైన్యానికి పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించారు. సాధారణంగా ఆధ్యాత్మిక ధర్మ ప్రచారం మినహా, ఐహిక విషయాలు మాట్లాడే అలవాటు లేని చినజీయర్ స్వామి.. భారత సైన్యానికి పూర్తి మద్దతు ఇస్తున్నాం అని ప్రకటించారు. ప్రధాని మోదీ పిలుపు ఇచ్చినట్లుగా ఇండియన్ ఆర్మీకి పది లక్షల రూపాయల విరాళం కూడా తమ పీఠం తరఫున ఇస్తున్నట్లుగా చినజీయర్ ప్రకటించడం విశేషం.
ఆధ్యాత్మక వేత్త చినజీయర్.. ధర్మంతో పాటు దేశాన్ని కూడా రక్షించుకోవడం మన కర్తవ్యం అంటూ ప్రబోధించడం విశేషం. తమ పీఠం ఆధ్వర్యంలో షష్ట్యబ్ది ఉత్సవాలను నిర్వహించడానికి పూనుకుంటూ.. వివిధ రంగాలకు చెందిన 60 మందిని ఈ ఉత్సవాలలో సత్కరించనున్నట్లుగా చినజీయర్ ప్రకటించారు.
మోదీ స్నేహ హస్తాన్ని అందిస్తోంటే.. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నదంటూ చినజీయర్ చెప్పుకొచ్చారు. గతంలో వాజపేయి బస్సుయాత్ర చేస్తే.. పాక్ కార్గిల్ య ుద్ధానికి దిగిందని.. ఇప్పుడు కూడా అలాంటి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నదని పేర్కొన్నారు. అన్నిమతాలూ కూడా భారత సైన్యానికి మద్దతుగా, అండగా ఉండాలంటూ జీయర్ పిలుపు ఇచ్చారు.
భారత్ ఎప్పుడూ విదేశాలతో సఖ్యతగా ఉండాలనే కోరుకుంటుందని... అయితే పాకిస్తాన్ మీద దాడుల ద్వారా మన భారత సైన్యం తమ పటిమను ప్రదర్శించిందని ఆయన ప్రశంసించారు. ఇలాంటి సమయంలో దేశం యావత్తూ కూడా వారికి అండగా ఉండాలని చినజీయర్ పేర్కొనడం విశేషం.

