చారిత్రాత్మక టెస్ట్ లో విరాట్ సేన విజయభేరి

భారత క్రికెట్ చరిత్రలో ఓ అరుదైన ఘట్టం ఆవిష్కరణ అయింది. 500 టెస్ట్ మ్యాచ్ లను భారత్ పూర్తి చేసింది. అది కూడా ఘనవిజయంతో ఈ మైలురాయిని అధిగమించింది. భారత్ లో కాన్పూర్ లో న్యూజీల్యాండ్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో సోమవారం మధ్యాహ్నం 12.45 గంటల సమయానికే విరాట్ సేన విజయభేరిని మోగించింది. అపూర్వమైన విజయాన్ని భారత క్రీడాభిమానులకు కానుకగా అందించింది.
కాన్పూర్ టెస్ట్ మొదలైన రోజున విరాట్ బ్యాటింగ్ ను ఎంచుకుని తప్పు చేశామా అనే అభిప్రాయం కలిగించారు. అదే రోజు భారత్ ఏకంగా 9 వికెట్లు కోల్పోయింది. రెండో రోజు న్యూజిలాండ్ పటిష్ట స్థితికి వెళ్లగా, వర్షం ఆటను అంతరాయపరచింది. ఇలాంటి దోబూచులాటల మధ్య మ్యాచ్ జరిగింది. అయితే విజయానికి ఆరు వికెట్ల దూరంలో అయిదో రోజు ఆటను ప్రారంభించిన విరాట్ సేనకు మధ్యాహ్నానికే తిరుగులేకుండాపోయింది. న్యూజీలాండ్ రెండో ఇన్నింగ్స్ లో భారత స్పిన్నర్లు వారికి చుక్కలు చూపించారు. రవిచంద్ర అశ్విన్ ఏకంగా 6 వికెట్లు తీయడం విశేషం.
సెకండ్ ఇన్నింగ్స్ లో న్యూజీలాండ్ 236 పరుగులకే ఆలౌట్ అయింది. 197 పరుగుల తేడాతో మనకు విజయం లభించింది. ఇది న్యూజీల్యాండ్ పై భారత్ కు 19వ టెస్ట్ విక్టరీ.
భారత్ : 318 , రెండో ఇన్నింగ్స్ 5 వికెట్లకు 377
న్యూజీలాండ్ : 262, రెండో ఇన్నింగ్స్ 236

