చంద్రబాబూ....దీని సంగతేంటి?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్వీట్ల ద్వారా ఏపీ సర్కార్ ను ప్రశ్నిస్తున్నారు. ఇటీవలే ఏపీలో నాలుగురోజుల పాటు పర్యటించిన పవన్ తర్వాత వరుసగా ట్వీట్లతో నిలదీస్తూవస్తున్నారు. తాజాగా ఫాతిమా కళాశాల విద్యార్థుల గురించి పవన్ వరుస ట్వీట్ల ద్వారా ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించారు. చంద్రబాబు దృష్టికి తన ట్వీట్ల ద్వారా ఫాతిమా కళాశాల విద్యార్థుల అవస్థను తీసుకొచ్చే ప్రయత్నం చేశారు పవన్. కడప లోని ఫాతిమా మెడికల్ కళాశాల విద్యార్థులు భవిష్యత్ గందరగోళంలో పడింది. ఎంసీఐ అనుమతి లేకుండానే కళాశాల యాజమాన్యం సీట్లను భర్తీ చేసుకుంది.
ఫాతిమా మెడికల్ విద్యార్థులపై పవన్ ట్వీట్లు....
అయితే ఆ తర్వాత ఎంసీఐ గుర్తింపు లేదని ఆ సీట్లను రద్దు చేసింది. దీంతో విద్యార్థులు వీధినపడ్డారు. ఇటీవల విజయవాడ వచ్చిన పవన్ కు ఫాతిమా కళాశాల విద్యార్థులు తమ గోడును విన్పించారు. అయితే తాను ఈ విషయంపై ముఖ్యమంత్రితో మాట్లాడతానని పవన్ హామీ ఇచ్చారు. ఇప్పటి వరకూ ఫాతిమా కళాశాల విద్యార్థులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. సుప్రీంకోర్టులో కూడా చుక్కెదురైంది.
వారు కోల్పోయిన కాలాన్ని ఎవరిస్తారు?
ఈ నేపథ్యంలో పవన్ మరోసారి ఫాతిమా కళాశాల విద్యార్థుల అవస్థలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఫాతిమా మెడికల్ కళాశాల విద్యార్థుల జీవితాలు బాధ్యతారాహిత్యమైన, అనాలోచిత నిర్ణయాలుతీసుకున్న మేనేజ్ మెంట్ కారణంగానే బలయిపోయాయని పవన్ అభిప్రాయపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారి గోడును పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. యాజమాన్యానికి శిక్ష విధించకుండా.. విద్యార్థులను బలి చేయడం ఎంతవరకూ సబబని పవన్ ప్రశ్నించారు. అదే విదేశాల్లో అయితే మేనేజ్ మెంట్ ను జైలుకు పంపేవాళ్లని ట్వీట్ చేశారు. విద్యార్థులు కోల్పోయిన సమయాన్ని, డబ్బును వారికి ఎవరికి ఇస్తారన్నారు. దయచేసి విద్యార్థులకు న్యాయం జరిగేలా చూడాలని పవన్ తన వరుస ట్వీట్లతో ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు.
- Tags
- పవన్ కల్యాణ్

