చంద్రబాబు రూటు మార్చేసినట్లున్నారే?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రంపై ఇక దూకుడు పెంచేందుకే నిర్ణయించుకున్నట్లుంది. మోడీతో భేటీకి ముందే కేంద్రంతో అమితుమీ తేల్చుకోవాలని సిద్ధమవుతున్నట్లుంది. ఎన్నాళ్లు ఓపిక పట్టాలి? సహనానికి ఒక హద్దుంటుందన్న భావన చంద్రబాబులో స్పష్టంగా కనపడుతోంది. గత కొన్నాళ్లుగా బీజేపీ చంద్రబాబును దగ్గరకు రానివ్వడం లేదు. ఏడాది కాలం నుంచి అపాయింట్ మెంట్ కూడా ఇవ్వడం లేదు. అందుకే నంద్యాల ఉప ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కొంత వాయిస్ మార్చారు. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ బీజేపీని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు.
సహనం నశించేనా....
రాష్ట్రానికి రావాల్సిన నిధులు సరిగా అందడం లేదు. విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం దాదాపు పక్కన పడేసింది. ఇక పోలవరం విషయం అందరికీ తెలిసిందే. కొర్రీల మీద కొర్రీలు వేస్తూ నానుస్తున్నారు. దీంతో పోలవరం అనుకున్న సమయానకి పూర్తయ్యేటట్లు కన్పించడం లేదు. జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని ఎన్నిసార్లు కలిసినా ఆ సమావేశంలో మాత్రం ఖచ్చితంగా సహకరిస్తామని చెప్పి పంపుతున్నారే తప్ప తర్వాత కొర్రీలు మామూలే. దీంతో ఇటీవల టీడీపీ ఎంపీలను మోడీ వద్దకు పంపిన చంద్రబాబు ఆయనను కొంత గట్టిగానే కోరాలని చెప్పినట్లు తెలుస్తోంది. ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వంటి వారు కూడా మోడీపై నేరుగా విమర్శలు చేస్తుంది అందుకేనేమో.
మోడీతో సమావేశానికి ముందే....
ఈ నేపథ్యంలో మోడీ అపాయింట్ మెంట్ చంద్రబాబుకు ఎట్టకేలకు లభించింది. అయితే తేదీ ఇంకా ఖరారు కాకున్నా ఈ నెల రెండో వారంలో మోడీని చంద్రబాబు కలిసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో గవర్నర్ నరసింహన్ తో ప్రధాని మోడీ భేటీ చంద్రబాబుకు పుండు మీద కారంచల్లినట్లయింది. తన మీద నమ్మకం లేక గవర్నర్ నుంచి రాష్ట్ర పరిస్థితిపై ఆరా తీస్తున్నారన్న అనుమానం చంద్రబాబులో బయలుదేరింది. దీంతో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి కొంచెం ఘాటుగా...కటువుగానే చంద్రబాబు లేఖ రాయడం చర్చనీయాంశమైంది. దాదాపు ఆరు ప్రాజెక్టులకు సంబంధించి 16,725 కోట్ల రూపాయలు నిధులు రావాల్సి ఉందని లేఖలో చంద్రబాబు కోరారు. పట్టణ నీటి సరఫరాకు 4,500 కోట్లు, గ్రామాల నుంచి మండలాలకు రోడ్ల నిర్మాణం కోసం 3,200 కోట్లు, వెనకబడిన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి వెయ్యి కోట్లు, అమరావతి గ్రీన్ డెవలెప్ మెంట్ కు 1,484 కోట్లు, రెసిడెన్షియల్ స్కూల్స్ భవన నిర్మాణాలకు 1600 కోట్లు, రహదారులు, వంతెనల నిర్మాణానికి 3,200 కోట్ల రూపాయలు తక్షణమే విడుదల చేయాలని తన లేఖలో కోరారు. ఇకపై జాప్యం చేయడం తగదని కూడా చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. ప్రధాని మోడీతో భేటీకి ముందు చంద్రబాబు అరుణ్ జైట్లీ కి లేఖ రాయడం వెనక తన సమావేశంలో ఇవే అంశాలు చర్చకు వస్తాయన్న సంకేతాలు పంపినట్లయింది.
- Tags
- చంద్రబాబు మోడీ

