చంద్రబాబు కల నెరవేరుతున్న వేళ...!

ఆంధ్రప్రదేశ్ లో మరో మైలురాయిని చేరుకోనుంది. ఈరోజు రాష్ట్రపతి చేతుల మీదుగా ఏపీలో ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు ప్రారంభం కానుంది. ఫైబర్ గ్రిడ్ ద్వారా ఏపీ ప్రజలకు నాణ్యమైన సేవలను అతి తక్కువ ధరకు అందిస్తామని చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి మరికొద్దిసేపట్లో ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. ఉదయం 9.30 గంటలకు విజయవాడ చేరుకోనున్న రాష్ట్రపతిరామ్ నాధ్ కోవింద్ ఇండియన్ ఎకనమిక్ అసోసియేషన్ శతాబ్ది వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం సచివాలయంలో ఫైబర్ గ్రిడ్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. తర్వాత రాష్ట్రపతి రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ ను కూడా సందర్శించనున్నారు.
డిజిటల్ ఏపీగా మార్చాలని...
ఏపీని డిజిటల్ ఆంధ్రప్రదేశ్ గా మార్చాలన్నది చంద్రబాబు లక్ష్యం. ఆ దిశగా అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీలో ఫైబర్ గ్రిడ్ ను ప్రారంభిస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఈ ప్రాజెక్టు అమలయితే కేవలం 235 రూపాయలకే ఇంటర్నెట్ తో పాటు ఫోన్ కాల్ సదుపాయాన్ని కూడా కల్పిస్తారు. అలాగే 250 టీవీ ఛానళ్లను దీని ద్వారా వినియోగదారులు పొందే అవకాశముంది. అలాగే వీడియో కాలింగ్, అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ సౌకర్యం కూడా ఈ ప్రాజెక్టులో ఉంది.
తక్కువ ఖర్చుతో ఇంటర్నెట్...
ఏపీలో ఈ ప్రాజెక్టు ద్వారా పది లక్షల గృహాలకు కనెక్షన్లు ఇవ్వాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఇప్పటి వరకూ లక్షా మూడు వేల గృహాలకు మాత్రమే కనెక్షన్లు ఇవ్వగలిగారు. అయితే ఈ ప్రాజెక్టును ప్రారంభించిన తొలినాళ్లలో భూగర్భ మార్గం ద్వారా కేబుల్ వేయాలని భావించారు. అయితే ఇందుకు ఐదు వేల కోట్లు ఖర్చవుతుందని అంచానాలు అందడంతో ఆ ప్రయత్నాన్ని మానుకుంది ఏపీ సర్కార్. విద్యుత్తు స్థంభాల నుంచే కేబుల్ వైర్లను లాగారు. ఇందుకు 330 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. మొత్తం మీద చంద్రబాబు కలల ప్రాజెక్టు ఈరోజు సాకారం కానుంది. రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ మరికాసేపట్లో జాతికి అంకితం చేయనున్నారు.
- Tags
- చంద్రబాబు

