చంద్రబాబు ఎన్నిసార్లు చెప్పినా సరే....?

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు పొగడ్తలు...ప్రశంసలు...చప్పట్లు... తప్ప ప్రజలకు ఉపయోగపడే చర్చ ఏదీ జరగడం లేదన్నది వాస్తవం. గత వారం రోజులుగా జరుగుతున్న శాసనసభ సమావేశాలను పరిశీలిస్తే ప్రధానంగా పోలవరం, రాజధాని నిర్మాణం, పట్టిసీమ పై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు ఇవ్వడం, చంద్రబాబు దాని గురించి పూసగుచ్చినట్లు వివరించడం... వెనువెంటనే చప్పట్లు మోగడంతోనే సభ పూర్తవుతుంది. ముఖ్యంగా ఏపీలో రాజధాని జిల్లాలోనే రైతులు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సంచలనం కల్గించింది. రుణమాఫీ చేశామని, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తున్నామని, ఎరువులు,పురుగుమందులు అందుబాటులో ఉంచామని ఊకదంపుడుగా చెబుతున్న ప్రభుత్వానికి రైతు ఆత్మహత్యలుకన్పించడం లేదా? అన్న విమర్శలు విన్పిస్తున్నాయి. ప్రతిపక్ష వైసీపీ శాసనసభ సమావేశాలకు దూరంగా ఉండటంతో శాసనసభ ఏకపక్షంగా సాగిపోతుంది. చెప్పిందే... చెప్పి... సాగదీస్తుండటంతో విసుగొస్తుందని కొందరు ఎమ్మెల్యేలు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు.
మంత్రులదీ అదే తీరు....
క్షేత్రస్థాయిలో అంతా మంచిగానే ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతుండటంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా ప్రశ్నించలేని పరిస్థితి. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ప్రశ్నించినా మంత్రుల నుంచి సరైన సమాధానాలు రావడం లేదు. బీజేపీ శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్ రాజు ఒక్కరే అడపాదడపా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నా అది ఫలించడం లేదు. దీంతో పాటు శాసనసభ సమావేశాలకు ఎమ్మెల్యేల హాజరీ కూడా తక్కువగానే ఉంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సభలో ఉన్నంతవరకూ ఎమ్మెల్యేలు ఉంటున్నారు. మిగిలిన సమయంలో సభ నుంచి బయటకు వెళ్లిపోతున్నారు. కొందరు ఎమ్మెల్యేలు సభ ప్రారంభమైన గంట తర్వాత కాని చేరుకోవడం లేదు. టీడీపీ శాసనసభ్యులు 103 మంది ఉండగా 90 మంది మాత్రమే రోజూ హాజరవుతున్నట్లు తేలింది. కొందరు వ్యక్తిగత పనులపై నియోజకవర్గాల్లోనే ఉన్నారు. దీంతో గత రెండు మూడు రోజులుగా చంద్రబాబు గైర్హాజరవుతున్న, ఆలస్యంగా వస్తున్న ఎమ్మెల్యేలకు క్లాస్ పీకుతున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఎమ్మెల్యేలకు అటెండెన్స్ రిజిస్టర్ కూడా పెట్టారు. పొగడ్తలు, ప్రశంసలకోసమే అయితే ఈ సమావేశాలకు లక్షలు ఖర్చు పెట్టడం ఎందుకన్న ప్రశ్నలు విన్పిస్తున్నాయి. మంత్రులు కూడా ముందుగానే ప్రిపేర్ అయి సమాధానాలివ్వాలని ముఖ్యమంత్రి చెప్పినా కొందరు మంత్రులు లైట్ గా తీసుకోవడం గమనార్హం.

