చంద్రబాబుది సదాశయమే ; అయినా చిక్కులున్నాయ్!

రాష్ట్రంలో ఆన్ లైన్ మరియు మొబైల్ లావాదేవీలు పెరగాలని చంద్రబాబు నాయుడు తొలినుంచి చెబుతున్నారు. నిజానికి ఆర్ధిక అవకతవకలని వీలైనంత వరకు తగ్గించడానికి, ఈ పద్ధతిలో ఎంతో ఉపయోగం ఉంటుంది. రాష్ట్రంలో ఇలాంటి డిజిటల్ ఆర్ధిక లావాదేవీల విప్లవం తీసుకు రావడానికి చంద్రబాబు చాల వినూత్నమైన ఆలోచనలు చేస్తూనే ఉన్నారు. తాజాగా రాష్ట్రంలో ఉన్న పేదల్లో మొబైల్ లేనివారందరికీ స్మార్ట్ ఫోన్ లు ప్రభుత్వమే ఇవ్వాలనుకుంటున్న ఆలోచనను ఆయన ఇవాళ బయట పెట్టారు. ఒకరకంగా చెప్పాలంటే చంద్రబాబు ఆశయం మంచిదే గానీ, ముందు ముందు చాలా చిక్కులు. రావచ్చునని విశ్లేషకులు భావిస్తున్నారు.
స్మార్ట్ మొబైల్ లను ఫోను కాల్స్ చేసే అవసరాలకు తప్ప.. ఇతర అవసరాలకు వినియోగించడంలో కొంత సాంకేతిక పరిజ్ఞానం, అక్షరజ్ఞానం ఉండడం అవసరం. పూర్తిగా నిరక్షరాస్యులు, పరిమితమైన అక్షరజ్ఞానం ఉన్నవారు, ప్రధానంగా ఇంగ్లిషు తెలియని వారిని ఫోను ద్వారా చేయగలిగిన ఆర్థిక లావాదేవీల్లోకి దించడం అనేది వారినే చిక్కుల్లో పడేస్తుంది. లావాదేవీలో తేడా జరిగి.. సొమ్ము మరో ఖాతాలోకి వెళ్లడం, తేడా రావడం లాంటివి జరిగితే.. బ్యాంకును సంప్రదించి ఫిర్యాదులు అక్కడ నమోదుచేసి, ఆ చిక్కునుంచి బయటపడడం మారుమూల గ్రామాల్లో ఉండే వారికి చాలా పెద్ద యాతన అవుతుంది. పైగా మరో సమస్య ఏంటంటే.. పేదల్లో లేని వారికి స్మార్ట్ ఫోన్లు ఇస్తా అని చంద్రబాబు ప్రకటిస్తే.. ప్రతి ఒక్కరూ తమకు ఫోను లేదనే అంటారు. అంటే అయితే గియితే.. ప్రతి కుటుంబానికి ఒక స్మార్ట్ ఫోను ఇచ్చేలా ఆ పథకానికి రూపకల్పన జరగాలి. ప్రభుత్వం మీద అదొక పెద్ద ఆర్థిక భారం అవుతుంది. పోనీ దానివల్ల ప్రయోజనం ఉన్నదా అంటే అది కూడా లేదు. ప్రజలు మరింతగా యాన పడడమే.
మరి అలాంటప్పుడు ప్రభుత్వం పరంగా.. ఆన్లైన్ లావాదేవీల్లో ఉండే సదుపాయాలను వారికి వివరించి, వాడకం గురించి అవగాహన కలిగించేందుకు నిత్యప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంటే చాలు. ఆసక్తి ఉన్న వారు స్మార్ట్ ఫోను లు కొనుక్కుని చంద్రబాబు ఆలోచనను అందిపుచ్చుకోగలరు. చంద్రబాబునాయుడుకు ప్రజల్లో ఈ స్మార్ట్ వినియోగం పెంచాలనే మమకారం అంత ఎక్కువగా ఉంటే గనుక.. ఆర్థిక లావాదేవీల గురించి అవగాహన కల్పిస్తూ, ఆసక్తి ఉన్న వారికి ఒక్కో కుటుంబ రేషన్ కార్డుకు ఒక్కొక్కటి వంతున స్మార్ట్ ఫోనును సబ్సిడీ ధరకు అందించే ఏర్పాటు చేస్తే సరిపోతుంది. దానివల్ల వినియోగిత పెరుగుతుంది. ఆసక్తి ఉన్న వారు మాత్రమే ముందుకు వస్తారు. ప్రస్తుతం జరుగుతున్న లావాదేవీల్లో 30 శాతం డిజిటల్ యుగంలోకి మారినా.. చాలా అద్భుతమైన విప్లవమే అవుతుంది. మరి ఆ దిశగా చంద్రబాబు నాయుడు తన ఆలోచనకు పదును పెడిగే ప్రయోజనం గరిష్టంగా ఉంటుందని పలువురు భావిస్తున్నారు.

