గోరంట్లకు ఆయనతో ఎందుకు చెడింది?

రాజమండ్రి రూరల్ ఎమ్యెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎమ్యెల్సీ ఆదిరెడ్డి అప్పారావు నడుమ మరోసారి విభేదాలు రోడ్డెక్కాయి. ఈసారి వారిద్దరూ కౌన్సిల్ సమావేశం వేదికగా చెలరేగి ఒకరిపై మరొకరు నిందారోపణలు సాగించారు. గత కొంతకాలంగా గోరంట్ల, ఆదిరెడ్డి నడుమ ఆధిపత్య పోరాటం అనేక వేదికలపై కొనసాగుతూ వస్తుంది. తాజాగా కూడా మరోసారి ఇరువురు నేతలు విమర్శలు చేసుకోవడం తమ్ముళ్లలో కలవరం పుట్టిస్తుంది.
నువ్వెంత అంటే నువ్వెంత ...
ఇటీవల కొంత కాలంగా ఆదిరెడ్డి అప్పారావు రాజమండ్రి అభివృద్ధికి సంబంధించిన నిధులను తన పలుకుబడితో మంజూరు చేయించుకుని ఆ జీవోలు తెచ్చి మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీనిపై కౌన్సిల్ లో గోరంట్ల నిలదీశారు. నగర అభివృద్ధిపై రాజమండ్రి అర్బన్ ఎమ్యెల్యే విషయాలు వెల్లడించాలని ఎమ్యెల్సీ గా వున్న మీకు ఆ హక్కు లేదంటూ అప్పారావు పై ఫైర్ అయ్యారు. దీనికి ఆదిరెడ్డి ఘాటుగానే స్పందించారు. అభివృద్ధిని రాజకీయం చేయడం తగదని తాను ఎమ్యెల్సీ అయితే నిధులు ఎందుకు తేకూడదని నిలదీశారు. రాజమండ్రి అభివృద్ధికి పార్టీ పరంగా తనను గూడా ఛైర్మెన్ గన్ని కృష్ణ ను ఇన్ ఛార్జ్ గా చంద్రబాబు నియమించారని, ఏమైనా చెప్పుకుంటే ఆయనకే చెప్పుకుంటా అన్నారు ఆదిరెడ్డి. అప్పారావు వల్లే తాను రెండుసార్లు ఓడిపోయానని ఆయన వెన్నుపోట్లే కారణమన్నారు బుచ్చయ్య . దీనికి కౌంటర్ గా గోరంట్ల ఏనాడు పార్టీకి వ్యతిరేకంగా గాలి వున్నప్పుడు గెలిచిన నాయకుడు కాదని అప్పారావు దెప్పి పొడిచారు. ఇలా వీరిద్దరి మధ్య సంవాదం టి కప్పులో తుఫాన్ లా చెలరేగి అంతా సర్ది చెప్పడంతో సద్దుమణిగింది.
అర్బన్ పై కన్నేసిన ఇరువురు నేతలు ...
ప్రస్తుతం రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి తిరిగి అర్బన్ కి వచ్చే ప్రయత్నాల్లో వున్నారు. అయితే ఇప్పటికే ఎమ్యెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అర్బన్ లో జోరుగా కార్యక్రమాలు సాగిస్తూ తనకు లేదా తన కుమారుడు శ్రీనివాస్ లలో ఒకరికి టికెట్ ఇవ్వాలని అధిష్టానం ముందు కర్చీఫ్ వేసి ఉంచారు. ఆ కండిషన్ పైనే ఆయన వైసిపి నుంచి టిడిపి కి జంప్ అయ్యారు. ఆదిరెడ్డి పార్టీ మారిన నాటినుంచి గోరంట్ల ఆయనపై కారాలు మిరియాలు నూరుతున్నారు. ఆయన చేరిన కొద్ది కాలానికే అప్పారావు కి చెక్ పెట్టడానికి ఆదిరెడ్డి తోడల్లుడు ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ ఛైర్మన్ చల్లా శంకర రావు ను టిడిపి లోకి తీసుకువచ్చి చంద్రబాబు సమక్షంలో చేర్చారు. అప్పటి నుంచి గోరంట్ల నడుమ వ్యవహారాలన్నీ ఉప్పు నిప్పు గానే నడుస్తున్నాయి. ఇవి మరింత ముదిరి పాకాన పడతాయా లేక బాబు ఎవరి బౌండరీలు వారికి నిర్ధేశిస్తారా చూడాలి. అప్పటివరకు రాజమండ్రి అర్బన్ టిడిపి రాజకీయాలు వేడి వేడి గా సాగేలాగే కనిపిస్తున్నాయి.

