గోదావరి జిల్లాల నేతలకు ఈ టెన్షన్ ....!

సంక్రాంతి కోడి పందాలపై హైకోర్టు ఏపీ సర్కార్ కి మొట్టిన మొట్టికాయలతో నేతల్లో టెన్షన్ మొదలైంది. అదేంటి టెన్షన్ పందెం రాయుళ్ళకు కదా అనుకుంటే పొరపాటే. తమ ప్రాంతంలో కోడి పందాలు నిర్వహించలేకపోతే ఆయా నియోజకవర్గ ఎమ్యెల్యేలు దద్దమ్మలు గా ప్రజలు భావించి ఎన్నికల్లో ఓడించిన సందర్భాలు సైతం గోదావరి జిల్లాల ఎన్నికల కొన్ని ప్రాంతాల్లో నమోదైన చరిత్ర వుంది. ఆ చరిత్రే ఇప్పుడు నేతలను భయపెడుతుంది. విడవమంటే పాముకి కోపం, కరవమంటే కప్పకు కోపం అన్నచందంగా పందాలు నిర్వహిస్తే కోర్టు, నిర్వహించకపోతే తమ ప్రాంతంలో హీరోలు జీరోలుగా మిగులుతామన్న ఆందోళన హై కోర్టు తాజా ఆదేశాలతో మొదలైంది.
పోలీసులు డీలా పడ్డారు ....
కోర్టు ఆదేశాలతో పోలీసులకు తలనొప్పులు మొదలయ్యాయి. చర్యలు తీసుకుంటే నేతలు కక్ష గడతారు. కోడికి కత్తి కట్టిన రుజువులు దొరికితే కోర్టు చర్మం వలిచేస్తుంది. ఇప్పుడెలారా బాబు అని ఖాకీలు కలవరపడుతున్నారు. మరికొందరు పోలీసులు ఇంకోలా బాధపడుతున్నారు. పండగ పూటా తమకు నాలుగు రూపాయలు సంపాదించి పెట్టె కోడిపందాలు లేకపోతే తీవ్రంగా నష్టపోతామని మధన పడుతున్నారు. పందెం బరులు ఏర్పాటు చేసుకోవడం దగ్గరనుంచి పోటీల పూర్తి అయ్యే వరకు రక్షణ కల్పించే బాధ్యత తీసుకున్నందుకు అనధికారికంగా గోదావరి జిల్లాలో పోలీస్ స్టేషన్ల వారీగా మామూళ్ళు భారీ స్థాయిలో ముడతాయి. హై కోర్ట్ ఆదేశాలు ఇప్పుడు వారి ఆశలపై నీళ్ళు చల్లాయి.
కత్తి లేకుండా కోడి పందెం ఏమిటి ?
కోర్టు ఆదేశాలు తప్పించుకోవడానికి పందెం రాయుళ్ళు కొత్త పల్లవి అందుకున్నారు. కత్తి కట్టకుండా సంప్రదాయం కోసం కోళ్ళ యుద్ధం సాగిస్తామన్నది వారి వాదన. పైకి ఇలా చెప్పి లోపల యధావిధిగా కత్తి కట్టి పందేలు నిర్వహించాలన్నది మరికొందరి ప్లాన్. ఇంకొందరు రహస్య పందేలు నిర్వహించేందుకు ప్రాంతాలను ఇప్పటినుంచి వెతకడం ప్రారంభించారు. పోలీసులు చేరుకోకుండా తాము ఆహ్వానించినా వారికి మాత్రమే ప్రవేశం కల్పించి పటిష్ట భద్రత నడుమ పందేలు ఏర్పాటు చేసే కార్యక్రమంలో పడ్డారు. కత్తి కట్టకుండా కోడి పందాలు ఒట్టిమాటలే అని కత్తి కట్టకపోతే గంటల కొద్ది కోళ్ళు పోరాడుతూనే వుంటాయని ఇది చూసే వారికి టెస్ట్ మ్యాచ్ ను తలపిస్తుందని, అంటున్నారు. టి ట్వంటీ మ్యాచ్ లు చూడటం అలవాటు అయ్యాకా టెస్ట్ మ్యాచ్ లు చూసే వారు ఎవరన్నది పందెం రాయుళ్ళ వాదన. ఈ నేపథ్యంలో గోదావరి జిల్లాలో సాగే కోడిపందేల వ్యవహారం ఇప్పడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యి కూర్చుంది.
- Tags
- కోడిపందేలు

