గూడూరులో జగన్ గోల్ అదే...!

నేడు జగన్ పాదయాత్ర ఒకరోజు విరామం అనంతరం ప్రారంభం కాబోతోంది. సూళ్లూరుపేట నియోజకవర్గంలో పాదయాత్రను ముగించుకుని ఈరోజు మధ్యాహ్నానికి గూడూరు నియోజకవర్గానికి జగన్ పాదయాత్ర చేరుకుంటుంది. జగన్ పాదయాత్ర నేటితో 72వ రోజుకు చేరుకుంది. గూడూరు నియోజకవర్గం ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి అడ్డాగా ఉండేది. 1985, 1994, 1999, 2009లో ఇక్కడ టీడీపీ విజయకేతనం ఎగుర వేసింది. బల్లి దుర్గాప్రసాద్ టీడీపీ ఎమ్మెల్యేగా ఇక్కడ నాలుగుసార్లు గెలిచారు. మంత్రిగా కూడా పనిచేశారు. అయితే 1989, 2004లో మాత్రం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. పి. ప్రకాశరావు ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా రెండుసార్లు గెలిచారు. అయితే గత ఎన్నికల్లో మాత్రం గూడూరు నియోజకవర్గాన్ని వైసీపీ కైవసం చేసుకుంది.
వైసీపీ మీద గెలిచి... జంప్ చేసి....
గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా సునీల్ కుమార్ టీడీపీ అభ్యర్థి బత్తల రాధా జ్యోత్స్న లతపై 9వేల ఆధిక్యంతో గెలిచారు. అయితే ఎన్నికల తర్వాత వైసీపీ నుంచి గెలిచిన గూడూరు వైసీపీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. నెల్లూరు జిల్లా నుంచి గెలిచి టీడీపీలోకి వెళ్లిన ఏకైక ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఒక్కరే కావడం విశేషం. ప్రస్తుతం పార్టీ మారిన సునీల్ కుమార్ నియోజకవర్గమైన గూడూరులో జగన్ పాదయాత్ర కొనసాగనుంది. ఇక్కడ ఇన్ ఛార్జిగా మేరిగ మురళిని జగన్ నియమించారు. ఆయనే పాదయాత్ర ఏర్పాట్లను దగ్గరుండి చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ గూడూరు నియోజకవర్గంలో పార్టీ జెండా రెపరెపలాడాలని జగన్ పాదయాత్ర ఇక్కడ చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
పాదయాత్ర సాగుతుంది ఇలా....
పార్టీమీద నమ్మకంతో ఓటువేసి గెలిపిస్తే, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసి స్వలాభం కోసం పార్టీలు మారుతున్నారని ఈ సందర్భంగా జగన్ ధ్వజమెత్తనున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను వచ్చే ఎన్నికల్లో తరిమికొట్టాలని జగన్ పిలుపునివ్వనున్నారు. గూడూరు నియోజకవర్గంలో జగన్ యాత్ర విజయవంతం చేసేందుకు వైసీపీ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. 72వ రోజు సూళ్లూరు పేట నియోజకవర్గంలోని ఓజిలి మండలం సంగటూరు నుంచి ప్రారంభం కానున్న ప్రజాసంకల్ప పాదయాత్ర చిల్లమాను చెన్నై క్రాస్ రోడ్స్, గుర్రంకొండ, అర్మేనుపాడు వరకూ సాగుతుంది. అర్మేను పాడు వద్ద జగన్ భోజన విరామానికి ఆగుతారు. అక్కడి నుంచి గూడూరు నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశించనుంది. గూడూరు మండలం కాండ్ర నుంచి పాదయాత్ర ప్రారంభమై వెంకటేశుపల్లి, తిమ్మసముద్రం క్రాస్ రోడ్స్ వరకూ సాగుతుంది. రాత్రి తిమ్మసముద్రం క్రాస్ రోడ్స్ లో జగన్ బస చేస్తారు.
- Tags
- జగన్

