గులాబీ ఎంపీలు సక్సెస్.. టీడీపీ ఎంపీలు ఫెయిల్...!

తెలంగాణ ఎంపీలు విజయం సాధించారు. కేంద్రంతో అమీతుమీకి సిద్ధపడ్డారు! ఎడతెరిపి లేకుండా పోరాటాలు చేశారు. హైకోర్టును విభజించాల్సిందేనంటూ పట్టు బట్టారు. నిరసనలు తెలిపారు. వారి ఆందోళనలకు కేంద్రం తలొగ్గింది. సుదీర్ఘంగా పెండింగ్లో ఉన్న హైకోర్టు విభజనకు కేంద్రం ఎట్టకేలకు ఆమోదం తెలిపేలా చేశారు. తమ రాష్ట్రానికి కావాల్సిన, విభజన చట్టంలోని అంశాలపై టీఆర్ఎస్ ఎంపీలు ఇంతటి పోరాటానికి సిద్ధపడ్డారు. కానీ విభజనలో ఏపీకి ఇస్తామన్న హామీలపై మాత్రం టీడీపీ ఎంపీలు మాత్రం కనీసం ఆందోళన చేపట్టన దాఖలాలు కనిపించడం లేదనే చర్చ మొదలైంది. ముఖ్యంగా ఏపీకి నిధులతోపాటు రైల్వేజోన్ అంశం విషయంలో టీఎంపీలు చూపిన తెగువ ప్రదర్శించి ఉంటే.. కేంద్రం చచ్చినట్టు ఇచ్చేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రాబట్టడంలో విఫలం....
రెండు రాష్ట్రాలపై కేంద్రం తొలి నుంచి చిన్నచూపు చూస్తూనే ఉంది. తెలంగాణ కంటే ఏపీకి మరింత అన్యాయం చేసిందనే వాదన తెలియనిది కాదు! ప్రత్యేకహోదా, రైల్వే జోన్, రాజధానికి నిధులు, పోలవరం నిర్మాణం వంటి అంశాల్లో కేంద్ర వైఖరి ఆక్షేపణీయంగానే ఉంది. ఎన్డీఏకు మిత్రపక్షంగా ఉన్నా.. వీటిని రాబట్టడంలో ఎంపీలు విఫలమయ్యారనే విమర్శ కూడా లేకపోలేదు. ఏపీకి దక్కాల్సిన ప్రయోజనాలపై, హామీలపై లోక్సభ సమావేశాల్లో కొందరు మినహా మిగిలిన వారు గట్టిగా మాట్లాడిన దాఖలాలు కూడా లేనే లేవు. మరోపక్క తెలంగాణ ఎంపీలు మాత్రం.. తమ రాష్ట్రానికి ఇస్తామన్న వాటిని సాధించడంలో సఫలీకృతులవుతున్నారు.
గులాబీ ఎంపీల పోరాట ఫలితమే...
తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుచేయాలని విభజన చట్టంలో స్పష్టంచేశారు. అయితే హైకోర్టు విభజన వంటి కీలక నిర్ణయాలు తీసుకోకుండా కేంద్రం మీనమేషాలు లెక్కించింది. ఈ విషయంలో కేంద్రంతో మడమ తిప్పకుండా గులాబీ ఎంపీలు పోరాటం సాగించారు. విభజన చట్టం చెప్పే అంశాల విషయంలో కేంద్రం సహజంగా ఉదాసీనత ప్రదర్శిస్తూ వచ్చినా.. తెరాస ఎంపీలు మాత్రం ప్రతిసారీ పార్లమెంటులో ఈ అంశాన్ని లేవనెత్తుతూ ప్రభుత్వ పెద్దలను తరచూ కలుస్తూ ఇదే విజ్ఞప్తిని వినిపిస్తూ వస్తున్నారు. మొత్తానికి వారి పోరాటాలకు తగిన ప్రతిఫలం దక్కింది. ఈ ఏడాది తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాటికి వారికి కొత్త హైకోర్టు కూడా ప్రారంభం కానుంది.
తెలంగాణ ఆవిర్భావం రోజునే...
ఈ ఏడాది జూన్ 2న తెలంగాణకు సొంత హైకోర్టు ప్రారంభం కాబోతున్నదని దానికి సంబంధించి సన్నాహాలు చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించినట్లుగా వార్తలు వస్తున్నాయి. మరోవైపు.. ఆ సమయంలోగా ఏపీ హైకోర్టు అమరావతికి తరలిపోవాల్సి ఉండగా.. వాటికి కూడా తాత్కాలిక భవనాల్ని ఏర్పాటు చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు చెబుతున్నారు. అయితే ఉత్తరాంధ్రకే కాక.. ఏపీకి వరదాయినిగా ఉంటే రైల్వేజోన్ అంశంపై కేంద్రాన్ని నిలదీయడంలో మాత్రం టీడీపీ ఎంపీలు పూర్తిగా విఫలమయ్యారు. కేంద్రమంత్రులు, ఇతరులను కోరినా.. అందులో చిత్తశుద్ధి లోపించడం.. కళ్లకు కట్టినట్టు కనిపిస్తోందనడంలో సందేహం లేదు.

