‘గాళ్ల సంగతి చూస్తా’ అంటున్న గులాబీ బాస్

తెలంగాణ రాష్ట్రం సరికొత్త రూపురేఖలతో చాలా విజయవంతంగా ప్రారంభం అయింది. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు సిద్ధిపేట జిల్లాను ప్రారంభించి రాష్ట్ర కొత్త రూపానికి ఆవిష్కరణ చేశారు. ఒకప్పట్లో కేసీఆర్ సొంత నియోజకవర్గం అయిన సిద్ధిపేటలో ఇప్పుడు ఆయన వారసుడిగా మేనల్లుడు హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. హరీష్రావు ప్రజల మనిషిగా, సాధారణ పౌరులకు అందుబాటులో ఉండే ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పాలన కాలం నుంచి కూడా చాలా మంచి పేరు తెచ్చుకోవడంతో.. అదివరకు కేసీఆర్ పుణ్యమా అని ఉన్న బలానికి, హరీష్ శ్రమ కూడా తోడయి.. ఇప్పుడు సిద్ధిపేట తెరాస పార్టీకి అతి బలమైన నియోజకవర్గంగా ఎదిగింది. అలాంటి సిద్ధిపేటను జిల్లా కేంద్రంగా కూడా కొత్త హోదాకు తీసుకువెళ్లిన ముఖ్యమంత్రి అక్కడి ప్రజలకు ఈ సందర్భంగా మరిన్ని వరాలు ఇచ్చారు. ఏడాదిలోగా మెడికల్ కాలేజీ, సిద్ధిపేటలో యూనివర్సిటీ ఏర్పాటు.. ఇవన్నీ ఆ ప్రాంత సర్వతో ముఖాభివృద్ధికి బాటలు వేస్తాయనడంలో సందేహం లేదు.
రాష్ట్రంలో అన్ని కొత్త జిల్లాలు కూడా ఒకే సమయానికి ప్రారంభం అయ్యాయి. సిద్ధిపేట జిల్లాను కేసీఆర్, హరీష్ కలిసి ప్రారంభించిన సమయానికే అన్ని కొత్త జిల్లాలను మిగిలిన అందరు మంత్రులు ప్రారంభించారు.
ఇక అసలు సంగతికి వస్తే.. కొత్త జిల్లాను ప్రారంభించిన సందర్బంగా కేసీఆర్ ప్రసంగంలో ఆయన రాజకీయ ఆవేశం కూడా కట్టలు తెంచుకుంది. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ మొదలైన నాటినుంచి విపక్షాలు అదే పనిగా రకరకాల విమర్శలు చేస్తూ చికాకు పెడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ‘‘కొత్త జిల్లాల గురించి చాలా మంది చాలా కారుకూతలు కూస్తున్నరు. ఇయాళ పండగని వదిలేస్తన్న. పండగనాడు తిట్టి బాదపెట్టడం ఎందుకని వదిలేస్తన్న. గాళ్ల సంగతి తరవాత చూస్తా’’ అంటూ కేసీఆర్ హెచ్చరించారు. ఆయన ప్రత్యేకంగా ఎవ్వరిపేర్లూ ప్రస్తావించలేదు గానీ.. జిల్లాల ఏర్పాటు విషయంలో నిర్దిష్ట ఆరోపణలు చేయకుండా, ఎలాంటి అశాస్త్రీయ పోకడలు ఉన్నాయో ఎత్తి చూపించకుండా.. కేసీఆర్ రాజకీయాలు చేస్తున్నాడు.. అంటూ విమర్శలు చేసిన కాంగ్రెస్ , తెదేపా నేతల మీదనే ఆయన ఫోకస్ పెట్టినట్లుగా పలువురు అనుకుంటున్నారు.
మరి గులాబీ బాస్ మదిలో ఆ రెండు పార్టీలలోని ఏయే నేతల మీద ఎక్కువ కోపం ఉన్నదో, వారి సంగతిని ఆయన ఎలా తేలుస్తారో వేచిచూడాలి.

