గాంధీ లో కీచకులు ....!

అక్కడ ఇక్కడ అని లేదు. ఎక్కడ చూసినా కీచకుల దాస్టికాలు నడుస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ లోని గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో వెలుగుచూసిన కీచకపర్వం సభ్య సమాజాన్ని నివ్వెరపరుస్తుంది. అక్కడ పనిచేస్తున్న సీనియర్ ల్యాబ్ టెక్నీషియన్స్ చాలా కాలంగా ట్రైనీ వైద్య విద్యార్థులను బ్లాక్ మెయిల్ చేసి తమ వాంఛలు తీర్చుకునే కార్యక్రమాన్ని గుట్టు చప్పుడు కాకుండా సాగిస్తున్నారు. తాజాగా కొందరు విద్యార్థులు ధైర్యం చేసి విషయాన్ని పోలీసులకు చేరవేయడంతో కటకటాలవెనక్కి నడిచారు దుర్మార్గులు. వీరి అరాచకాలపై గాంధీ వైద్యులు విచారణ జరిపి ఇచ్చిన నివేదిక ఖాకీలకు సాక్ష్యంగా నిలిచింది.
గాంధీలో అసలేం జరుగుతుంది....
వైద్య విద్యను అభ్యసించే విద్యార్థులకు మైక్రో బయాలజీ ల్యాబ్ లో శిక్షణ పొందాలిసి ఉంటుంది. దాంతో వారు అక్కడ నేర్చుకునేందుకు వస్తారు. వారు శిక్షణ పొందిన తీరును బట్టి టెక్నీషియన్స్ ప్రాక్టికల్ మార్కులు వేస్తారు. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి కీలకమైన ఈ మార్కుల కోసం ల్యాబ్ టెక్నీషియన్స్ విద్యార్థినులను బ్లాక్ మెయిల్ చేసి తాము చెప్పింది చెయ్యకపోతే మార్కులు నిల్ చేస్తామని బెదిరిస్తున్నారు. చాలామంది ఈ విషయాన్నీ ఎవరికి చెప్పుకోలేక లైంగిక వేధింపులు తాళలేక నరకాన్ని చవిచూస్తున్నారు. కొందరు తెగించడంతో ఈ దుర్మార్గుల పాపం పండింది. మహ్మద్ అక్రమ్ , ఆంటోని సెబాస్టియన్ మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ మొదలు పెట్టారు. ఆడపిల్లలు ధైర్యంగా ఇలాంటి అంశాల్లో పోలీసులను సంప్రదించాలని వారు ఇచ్చే ఫిర్యాదులు గోప్యంగా ఉంచుతామని నేరస్థులను కఠినంగా శిక్షిస్తామని విజ్ఞప్తి చేస్తున్నారు ఖాకీలు.
- Tags
- గాంధీ ఆసుపత్రి

