గవర్నర్ కు వ్యతిరేకంగా కమలనాధుల వెనక ఉన్నది ఎవరు?

బీజేపీ నేతల వెనక ఉన్నది ఎవరు? గవర్నర్ నరసింహన్ పై చంద్రబాబు గుర్రుగా ఉన్నారా? ఆంధ్రప్రదేశ్ కు కొత్త గవర్నర్ ను నియమించాలని చంద్రబాబు బలంగా కోరుకుంటున్నారా? అవుననే అనిపిస్తోంది. అయితే ముఖ్యమంత్రిగా, ఎన్డీఏలో భాగస్వామిగా గవర్నర్ పై తాను ఎటువంటి వ్యాఖ్యలు చేయలేరు. అలాగని తన పార్టీ నేతల నుంచి కూడా గవర్నర్ కు వ్యతిరేకంగా మాట్లాడనివ్వడం లేదు. ఇందుకోసం చంద్రబాబు బీజేపీ రాష్ట్ర నేతలను ఎంచుకున్నారా? అంటే అవుననే అంటున్నారు.
టీడీపీ కంటే బీజేపీ నేతలే....
గత కొద్దికాలంగా అధికారంలో ఉన్న టీడీపీ నేతల కంటే మిత్రపక్షంగా ఉన్న బీజేపీ నేతలే గవర్నర్ విషయంలో తెగ ఫీలయిపోతున్నారు. నాలా ఆర్డినెన్స్ విషయంలో గవర్నర్ పై బీజేపీ శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్ రాజు చిందులు తొక్కారు. గవర్నర్ ను మార్చాల్సిందేనని గట్టిగా స్వరం వినిపించారు. గవర్నర్ ను వెంటనే మార్చాలని ఎంపీలు ఢిల్లీలో యుద్ధం చేయాలని కూడా విష్ణుకుమార్ రాజు పిలుపునిచ్చారు. అయితే వెంటనే గవర్నర్ దానిని ఆమోదించి పంపించేశారు. అంతటితో వివాదం సమస్య పరిష్కారం అయిపోయిందని అందరూ అనుకున్నారు.
తాజాగా ఎంపీ లేఖతో....
కాని తాజాగా బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు, విశాఖ పార్లమెంటు సభ్యుడు కంభంపాటి హరిబాబు తాజాగా హోంమంత్రి రాజ్ నాధ్ సింగ్ కు లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ కు కొత్త గవర్నర్ ను నియమించాలని హరిబాబు ఆ లేఖలో కోరారు. అంటే రాష్ట్ర బీజేపీ నేతల్లో ఒక వర్గం గవర్నర్ కు వ్యతిరేకంగా పావులు కదుపుతుందన్నది స్పష్టమవుతోంది. గవర్నర్ ఇటీవల రాజ్ నాధ్ సింగ్, ప్రధాని మోడీని ప్రత్యేకంగా కలిసి వచ్చారు. ఏపీ పై పూర్తి స్థాయి నివేదికను వారికి సమర్పించారు. ఏపీలో గవర్నర్ ఉండకుండా తెలంగాణకే పరిమితమయ్యారన్నది వీరి వాదన.
నెగిటివ్ రిపోర్ట్ కారణంగానేనా?
అయితే ఢిల్లీ నుంచి అందిన సమాచారం ప్రకారం ఏపీలో పాలన, పోలవరం ప్రాజెక్టుపై గవర్నర్ ప్రధానికి నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చారని టీడీపీ అధినేత భావిస్తున్నారు. అందుకే తనకు అనుకూలంగా ఉన్న బీజీపీ నేతలను గవర్నర్ ను మార్చాలని డిమాండ్ చేసే విధంగా వ్యూహాన్ని రూపొందించినట్లు అమరావతిలో టాక్ నడుస్తోంది. గవర్నర్ తెలంగాణకు అనుకూలంగా, ఆంధ్రప్రదేశ్ కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు ఎప్పటి నుంచో తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నారు. తన మనసులో మాటలను తన వర్గానికి చెందిన కమలం పార్టీ నేతలతో చెప్పిస్తున్నారన్న ప్రచారం ఏపీలో జోరుగా సాగుతోంది.

