గర్జించిన వైసీపీ

ప్రత్యేక హోదా మన హక్కు - ప్యాకేజీ తో మోసం చేయొద్దు అన్న నినాదాలతో ఢిల్లీలోని సంసద్ మార్గ్ హోరెత్తింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటూ ఏపీలోని ప్రతిపక్ష వైసీపీ ఢిల్లీలో నినదించింది. ప్రత్యేక ప్యాకేజీతో తమను మోసం చేయవద్దంటూ వైసీపీ నేతలు కోరారు. ఢిల్లీ వేదికగా వైసీపీ ప్రత్యేక హోదా కోసం తన పోరాటం షురూ చేసింది. ఐదుకోట్ల మంది ఆంధ్రప్రజలకు ప్రత్యేక హోదా సంజీవిని అని వైసీపీ నేతలు అభిప్రాయపడ్డారు. ఢిల్లీలోని సంసద్ మార్గ్ లో జరిగిన ఆందోళన కార్యక్రమంలో వైసీపీ పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్ ఛార్జులు పాల్గొన్నారు.
ప్యాకేజీ వద్దే వద్దు....
ఆందోళన సందర్భంగా వైసీపీ నేతలు మాట్లాడుతూ ప్రత్యేక హోదా సాధించేంతవరకూ తమ ఉద్యమం ఆగబోదని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా వచ్చేంత వరకూ పోరాట పంథాను అనుసరిస్తామని తెలిపారు. ఇప్పటికే తాము రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం చేపట్టిందని, అది విజయవంతమైందని పేర్కొంది. గతంలో యువభేరి కారక్రమాలను నిర్వహించి యువతలో ప్రత్యేక హోదాపై అవగాహన కల్పించామని వైసీపీ సీనియర్ నేతల వైసీపీ సుబ్బారెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా కోసం గతంలోనే అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసిన విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు.
హోదా ఇచ్చేంత వరకూ.....
ఇంత పోరాటం చేసినా కేంద్రం దిగిరాకపోవడంపై వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో చంద్రబాబు ప్యాకేజీ ఇస్తామనగానే ప్రత్యేక హోదా అక్కర్లేదని చెప్పారని, ఇప్పుడు మళ్లీ హోదా కావాలని డ్రామాలాడుతున్నారని విమర్శించారు. నాలుగేళ్ల నుంచి విభజన హామీల అమలు కోసం ఎటువంటి ప్రయత్నాలు చేయకుండా కేంద్రంతో లాలూచి పడిన చంద్రబాబు ఎన్నికల సమయానికి వచ్చే సరికి హోదా నినాదాన్ని అందుకున్నారన్నారు. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ప్రత్యేక హోదా ప్రకటన చేయాలని లేకుంటే ఈ నెల 21వ తేదీన కేంద్రంపై అవిశ్వాసం పెడతామన్నారు. అప్పటికీ దిగిరాకుంటే ఏప్రిల్ 6వ తేదీన రాజీనామాలు చేస్తామన్నారు. మొత్తం మీద వైసీపీ వేలాది మందితో ఢిల్లీలో ఆందోళన కార్యక్రమం నిర్వహించడంతో జాతీయ మీడియా దృష్టిలో కూడా పడింది.
- Tags
- వైసీపీ

