గజల్ కు మద్దతుగా మంత్రి....!

లైంగిక వేధింపుల కేసులో అడ్డంగా బుక్ అయిన గజల్ శ్రీనివాస్ కి అండగా నిలిచారు ఏపీ దేవాదాయశాఖామంత్రి పైడికొండ మాణిక్యాల రావు. గజల్ శ్రీనివాస్ కేసు చూస్తే ఆయన్ను కావాలనే కుట్రతో ఇరికించి ఉంటారన్నది మాణిక్యాల రావు అనుమానం. కేవలం అనుమానం ఆయన అభిప్రాయం వరకు అయితే ఫరవాలేదు కానీ మాణిక్యాల రావు ఈ వ్యాఖ్యలను నేరుగా మీడియా ముందే చేశారు. గజల్ చిన్న పిల్లాడి దగ్గరనుంచి తనకు తెలుసునని చక్కటి తెలుగు భాషలో సందేశాలు ఇస్తూ ప్రపంచం చుట్టి వచ్చిన శ్రీనివాస్ అలాంటివాడు కాదన్నారు మంత్రి. గజల్ పెదనాన్నది తాడేపల్లి గూడెం అని ఆ కుటుంబం తో తనకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నారు మాణిక్యాల రావు. గజల్ గదిలో హిడెన్ కెమెరా ఏర్పాటు చేశారంటే కుట్ర కాక మరేమిటన్నది మంత్రి వాదన.
మంత్రి వ్యాఖ్యలపై మహిళా సంఘాల ఆగ్రహం ...
మంత్రి మాణిక్యాలరావు గజల్ శ్రీనివాస్ పై చేసిన వ్యాఖ్యలు పెనుదుమారమే సృష్ట్టించాయి. మంత్రి మహిళలను లైంగికంగా వేధించి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ వ్యక్తికి వత్తాసు పలకడాన్ని మహిళా సంఘాల నేతలు ఖండిస్తున్నారు. మాణిక్యాలరావు కి గజల్ తో సన్నిహిత సంబంధాలు ఉంటే ఉండొచ్చని అంత మాత్రాన సాక్ష్యాలతో సహా దొరికిపోయిన నిందితుడికి అండగా నిలవడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు. బాధ్యతాయుత మంత్రి పదవిలో వున్న వ్యక్తి తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటు జైల్లో వున్న నిందితుడి పక్షాన మాట్లాడటం సరికాదన్నది పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కేసు విచారణ దశలో వున్నప్పుడు ప్రభావవంతమైన స్థానాల్లో ఉండేవారు ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారని మహిళా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.
- Tags
- గజల్ శ్రీనివాస్

