కర్ణాటక కింగ్‌మేకర్ ఎవరో తేల్చేసిన సర్వే....!

ఒకే ఒక్క రాష్ట్రంలో జరిగిన ఎన్నిక దేశ వ్యాప్తంగా ఎంతో ఉత్సుకత రేపింది. ఒకే ఒక్క రాష్ట్రంలో గెలుపు కోసం బీజేపీ అష్టకష్టాలు పడింది. ఒకే ఒక్కరాష్ట్రంలో తన పట్టు నిలుపుకొనేందుకు అందరు కేంద్రమంత్రులను రంగంలోకి దించింది. ఎలాగైతేనే గుజరాత్ లో ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ద్వయం విజయం సాధించింది. అయితే వచ్చే ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి ఉంటుందా? బీజేపీకి కాంగ్రెస్ మళ్లీ ముచ్చెమటలు పట్టిస్తుందా ? ఇక ముందు జరిగే ఎన్నికల్లో అయినా హోరాహోరీ తప్పదా ? అనే సందేహాలు అందరిలోనూ మెదులుతున్నాయి. ఇప్పుడు అందరి దృష్టి త్వరలో జరగబోయే కర్ణాటక ఎన్నికలపై పడింది. ఈ నేపథ్యంలో కర్ణాటకలో నిర్వహించిన సర్వే ఫలితాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.
దక్షిణాదిన పాగా వేసేందుకు....
గుజరాత్ ఎన్నికల్లో ఓడిపోయినా.. నైతిక విజయం మాత్రం కాంగ్రెస్‌దేనని రాజకీయ పండితులు స్పష్టంచేశారు. ఈ ఎన్నికలు కాంగ్రెస్‌లో సరికొత్త జోష్ నింపాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. కాంగ్రెస్ విముక్త భారత్ నినాదంతో చెలరేగుతున్న మోడీకి.. గుజరాత్ ఎన్నికలు మింగుడు పడటం లేదనే విషయం తేలిపోయింది. వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోనే రేపటి లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ముడిపడి ఉంటాయన్న అంచనాల నేపథ్యంలో ఏ రాష్ట్రంలో ఎలాంటి ఫలితాలు వస్తాయనేది దేశ వ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. ముఖ్యంగా దక్షిణాదిలో పాగా కోసం బీజేపీ తీవ్రంగా ప్రయత్నాలు చేసినా అవన్నీ విఫలమవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటకలో ఎన్నికలు జరగబో తున్నాయి. దీంతో అటు కాంగ్రెస్‌ను దెబ్బతీసి, ఇటు దక్షిణాదిలో పట్టుకోసం అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తోంది.
సొంత సర్వేలో....
కర్ణాటకకు ఇది ఎన్నికల ఏడాది. సీఎం సిద్ధరామయ్య ప్రభుత్వానికి పరీక్షా కాలం. ఇక్కడ అధికారంపై కన్నేసిన బీజేపీ అమీతుమీ పోరాడుతోంది. తన చేతుల్లోని అతి తక్కువ రాష్ట్రాల్లో ఒకటైన కర్ణాటకను కాంగ్రెస్ నిలబెట్టుకుంటుందా? లేక ఇక్కడ బీజేపీ జయకేతనం ఎగరేస్తుందా? అనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వాళ్లే ఒక సర్వే చేయించుకున్నారట. రాష్ట్రంలో అధికారం తిరిగి తగ్గుతుందా? లేదా? అనే అంశంపై ఒక విదేశీ సర్వేయర్ కంపెనీతో కాంగ్రెస్ పార్టీ అధ్యయనం చేయించుకుందట. లక్షల మందిని కలిసి చేసిన ఈ సర్వే చేయగా.. ఇక్కడ హంగ్ తప్పనిసరిగా వస్తుందని తేలిందట.
హంగ్ తప్పదా?
224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటలో.. కాంగ్రెస్ గరిష్టంగా 81 సీట్లను గెలుచుకుంటుందట. ఇక బీజేపీ గరిష్టంగా 76సీట్లకు పరిమితం కానున్నదని సమాచారం. మిగిలిన సీట్లను జేడీఎస్, ఇండిపెండెంట్లు సాధించుకునే అవకాశాలున్నాయని వెల్లడైందట. అరవై సీట్లను జేడీఎస్ సొంతం చేసుకుంటుందని అంచనా. ఈ లెక్క ప్రకారం.. కర్ణాటకలో ఏర్పడేది హంగ్ ప్రభుత్వమేనట. కాంగ్రెస్ పై మరీ వ్యతిరేకత లేదు, బీజేపీకి అంత సానుకూలత లేదు, ఇదే సమయంలో జేడీఎస్ మాత్రం కింగ్ మేకర్ అవుతుందని సర్వే తేల్చేసింది. జేడీఎస్ ఎవరితో చేతులు కలిపితే, ఎవరితో జేడీఎస్ చేతులు కలిపితే వారు అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఈ అధ్యయనకర్తలు స్పష్టంచేస్తున్నారు.
- Tags
- కర్ణాటక సర్వే

