కోర్టు తీర్పుతో మాజీ ఎమ్మెల్యే కబ్జాలకు చిక్కులే

కాంగ్రెస్ నుంచి కారెక్కిన ఎమ్మెల్యే పువ్వాడ మెడకు చుట్టుకున్న భూఆక్రమణల కేసు అంతకంతకూ బిగుసుకుంటోంది. ఆయన చెరువు కబ్జాలకు పాల్పడ్డాడనే కేసులో న్యాయస్థానం షాక్ ఇచ్చేలా కొత్త నిర్మాణాలు చేపట్టకూడదంటూ ఇచ్చిన ఉత్తర్వులు, అదే సమయంలో తెరాస ప్రభుత్వానికి ఇచ్చిన ఆదేశాలు అన్నీ కూడా ఆయనకు చిక్కులు తెచ్చిపెట్టబోతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఖమ్మంలో సరస్సు భూమిని కబ్జా చేసిన కేసులో ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ కు హైకోర్టు షాకిచ్చింది. ఆ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలూ జరపకూడదని హైకోర్టు స్టే విధించింది. పువ్వాడ భూఆక్రమణకు పాల్పడ్డారంటూ సుధాకర్ రావు వేసిన పిటిషన్ ఈరోజు విచారణకు వచ్చింది. ఖమ్మంలోని మమతా మెడికల్ కాలేజీ నిర్మాణాలపై విచారణ జరిపిన కోర్టు.. అక్కడ 3 వారాల వరకూ ఎలాంటి నిర్మాణాలూ చేపట్టకూడదని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. కుటుంబానికి వామపక్ష నేపథ్యం ఉన్న నాయకుడే ఇలా అడ్డగోలు కబ్జాలకు పాల్పడతారా అనేది జనంలో నలుగుతున్న సందేహం.
ఆక్రమణకు గురైన వివాదాస్పద భూమిలో కట్టడాలపై వారం రోజుల్లో తమకు వివరణ ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. కడుతున్నవి అక్రమ నిర్మాణాలైనపుడు వాటిని ఎలా రెగ్యులరైజ్ చేస్తారంటూ సీరియస్సైంది. ఇటు పువ్వాడ మాత్రం తను ఎలాంటి భూకబ్జాలూ చేయలేదంటున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే తనపై ఆరోపణలు చేస్తున్నారని, నిజానిజాలు కోర్టులో వెల్లడవుతాయన్నారు. వివాదాస్పద భూమి సరస్సు భూమి కాదంటున్నారు పువ్వాడ. తనది కాని భూమిపై ఆశలేదని, ఈ అంశాన్ని అనవసర వివాదం చేయద్దని కోరుతున్నారు.
అయితే పువ్వాడ అజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే అయిన నేపథ్యంలో.. ప్రస్తుతం తమకు అందివచ్చిన అవకాశాన్ని తెరాస సర్కారు వినియోగించుకుని ఆయనను మరింత ఇరుకున పెడుతుందా అనే వాదన కూడా నడుస్తోంది.

